యాదగిరీశుడి సన్నిధికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - May 25 , 2026 | 04:54 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి, వారాంతపు సెలవుల కారణంగా 70 వేలమందికిపైగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు.
70వేల మందికి పైగా భక్తుల సందర్శన
ఆదివారం ఒక్కరోజే రూ.78,73,479 ఆదాయం
యాదాద్రి, మే 24(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి, వారాంతపు సెలవుల కారణంగా 70 వేలమందికిపైగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. కొండకింద ఘాట్‌రోడ్డు ప్రవేశం నుంచి కొండపై ఆలయ మాడ వీధులు, అంతరప్రాకార మండపాలు, ప్రసాదాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. ధర్మదర్శన క్యూలైన్లలో భక్తులు 4 గంటలపాటు నిరీక్షించారు. ఆదివారం ఒక్కరోజే రూ.78,73,479 ఆదాయం సమకూరింది. మరోవైపు కొండపైన ఎండతీవ్రతకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. బండలు కాలుతుండటంతో అట్టలపై నిల్చుని ఫొటోలు తీసుకున్నారు. ఉక్కపోత కారణంగా వృద్ధులు, పిల్లలు అవస్థలు పడ్డారు. కొండపై తాగునీటిని అందించే జలప్రసాదం పైపుల్లో వేడినీరు రావడంతో భక్తులు తాగలేకపోయారు. మట్టికుండలతో చల్లని నీటిని అందించినా రద్దీ కారణంగా ఇబ్బందులు పడ్డారు.