Share News

యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:44 AM

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని (ట్రస్టుబోర్డు) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి

  • చైర్మన్‌గా ప్రముఖ ఫార్మా కంపెనీ ఎంఎస్ఎన్‌ సీఎండీ మన్నె సత్యనారాయణరెడ్డి

  • సభ్యులుగా 10 మందికి అవకాశం

  • ఎమ్మెల్యే వినోద్‌ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, విజయ రాజం, తూళ్ల విజయేందర్‌కు చోటు

  • బోర్డులో వంశపారంపర్య ధర్మకర్త, ఏడుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు

యాదాద్రి, హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని (ట్రస్టుబోర్డు) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ ఎంఎస్ఎన్‌ గ్రూప్‌ చైర్మన్‌, ఎండీ మన్నె సత్యనారాయణరెడ్డి బోర్డు చైర్మన్‌గా నియమితులయ్యారు. ట్రస్టుబోర్డులో పది మంది సభ్యులు, మరో ఏడుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉంటారు. గడ్డం వినోద్‌ వెంకటస్వామి (బెల్లంపల్లి ఎమ్మెల్యే), కొణిదెల సురేఖ (ప్రముఖ నటుడు చిరంజీవి సతీమణి), చిల్లప్పగారి విజయ రాజం (విజయక్రాంతి దినపత్రిక చైర్మన్‌ సీ లక్ష్మీరాజం సతీమణి), ఎల్‌బీ నగర్‌కు చెందిన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌, తూళ్ల విజయేందర్‌ (దేవేందర్‌గౌడ్‌ కుమారుడు), నల్లగొండ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త గుండు మల్లయ్య, కంఠంనేని స్వాతి (నాట్కో ఫార్మా కంపెనీ), ఎం.రాఘవేందర్‌రావు (ఐఏఎస్‌ అధికారి రఘునందన్‌రావు తండ్రి), లక్ష్మీనారాయణ నాయక్‌ (జనగామకు చెందిన కాంగ్రెస్‌ నేత), వంశపారంపర్య ధర్మకర్త బి నర్సింహమూర్తిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ఎండోమెంట్స్‌ ముఖ్య కార్యదర్శి, ఎండోమెంట్‌ కమిషనర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌, యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వహణాధికారి, స్థానాచార్యులు లేదా సీనియర్‌ ప్రధానార్చకులు బాధ్యతలు నిర్వహిస్తారు. రెండేళ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఈ ధర్మకర్తల మండలి కొనసాగనుంది.


పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలకు నిరాశ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డులో ఈసారి పారిశ్రామికవేత్తలకు ఎక్కువగా అవకాశం లభించింది. గతంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనాయకులకు, కార్యకర్తలకు చోటు కల్పించేవారు. ఆ సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మండలి నియామకం ఉండటంతో.. గత రెండున్నరేళ్లుగా మండలి పదవులపై ఆశలు పెట్టుకున్న అధికార పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సంప్రదింపులు జరపకుండానే ఈసారి ట్రస్టుబోర్డును ప్రకటించినట్లు సమాచారం. దేవస్థానం అభివృద్ధిలో రాజకీయ జోక్యం లేకుండా చేయటంతోపాటు, దాతల నుంచి నిధులను పెద్ద ఎత్తున రాబట్టేలా ఈసారి బోర్డు నియామకం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, 2008 నుంచి 2010 వరకు అనువంశిక ధర్మకర్త చైర్మన్‌గా ట్రస్ట్‌బోర్డు కొనసాగింది. సవరించిన కొత్త చట్టం ప్రకారం ఈసారి చైర్మన్‌ పదవికి కూడా ప్రభుత్వమే నియామకం జరిపింది.

Updated Date - Jul 01 , 2026 | 05:46 AM