Share News

యాదగిరిగుట్ట ఆలయ చైర్మన్‌గా వంశపారంపర్య ధర్మకర్తను నియమించాలి

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:46 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్టీల బోర్డు చైర్మన్‌గా వంశపారంపర్య ధర్మకర్తను నియమించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

యాదగిరిగుట్ట ఆలయ చైర్మన్‌గా వంశపారంపర్య ధర్మకర్తను నియమించాలి

  • ట్రస్టీల బోర్డు ఏర్పాటు సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకం

  • హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్టీల బోర్డు చైర్మన్‌గా వంశపారంపర్య ధర్మకర్తను నియమించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 30న జారీచేసిన బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీల జీవో 392 సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని, అది చెల్లదని ఆరోపిస్తూ సికింద్రాబాద్‌కు చెందిన నాగిళ్ల శ్రీనివాస్‌, వంశపారంపర్య ధర్మకర్త భాస్కరాయని నర్సింహమూర్తి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అనువంశిక ధర్మకర్తలకు చట్టబద్ధంగా ఆలయ పరిపాలనలో తగిన పాత్ర, స్థాయి కల్పించకపోవడం పన్నాలాల్‌ బన్సీలాల్‌ పిట్టి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నారు. ట్రస్టీల బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వానికి అధికారం కల్పిస్తున్న తెలంగాణ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ రెలిజియస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ సవరణ చట్టం - 2025లోని సెక్షన్‌ 96, 97లు రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్‌ మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ల ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది రవిచందర్‌ వాదిస్తూ.. ట్రస్టీల బోర్డు ఏర్పాటు జీవోపై స్టే విధించాలని కోరారు. ఇందుకు నిరాకరించిన ధర్మాసనం.. ప్రభుత్వ, ప్రైవేటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ మూడువారాలకు వాయిదా పడింది.

Updated Date - Aug 05 , 2026 | 05:48 AM