భక్తజనసంద్రంగా యాదగిరిగుట్ట
ABN , Publish Date - Jun 08 , 2026 | 07:01 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడం, వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో..
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న 92 వేల మందికిపైగా భక్తులు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఈటల కూడా..
బాసర, యాదగిరిగుట్ట, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడం, వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 92వేల మందికిపైగా భక్తులు లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనానికి గంట, ధర్మదర్శనానికి 3గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. క్యూ కాంప్లెక్స్‌లు, క్యూలైన్లు రాత్రి వరకు భక్తులతో కిటకిటలాడాయి. కొండపైన, కింద పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో నిండిపోయాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.73,75,642ల ఆదాయం సమకూరింది. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్వామివారిని దర్శించుకున్నారు.
అక్షరాభ్యాసాలతో కిటకిటలాడిన బాసర
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో పాటు, అక్షరాభ్యాసాలకు శుభ ముహూర్తం కావడంతో చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. అక్షర శ్రీకార మండపాలు చిన్నారుల అక్షరాభ్యాసాలతో కళకళలాడాయి. తమ పిల్లలకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.