యాదగిరిగుట్టలో అభివృద్ధి పనులకు.. రూ.55.95 కోట్లు
ABN , Publish Date - Aug 15 , 2026 | 06:01 AM
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్-2047కు అనుగుణంగా యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధికి ఆలయ ధర్మకర్తల మండలి(ట్రస్టు బోర్డు) కీలక నిర్ణయాలు తీసుకుంది.
సొంత నిధులు ఇస్తానన్న బోర్డు చైర్మన్ సత్యనారాయణరెడ్డి
ఆ డబ్బుతో దీక్షాపరుల మండపం, నిత్యకల్యాణ మండపం,వరంగల్-హైదరాబాద్ హైవేపై స్వాగత తోరణాల నిర్మాణం
కొండపై శంఖు, చక్ర, నామాలతో విద్యుత్ బోర్డు ఏర్పాటుకు రూ.85లక్షలు ఇస్తానన్న కొణిదెల సురేఖ
ఆలయ అభివృద్ధికి ట్రస్టు బోర్డు పలు కీలక నిర్ణయాలు
యాదాద్రి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్-2047కు అనుగుణంగా యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధికి ఆలయ ధర్మకర్తల మండలి(ట్రస్టు బోర్డు) కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన ట్రస్టు బోర్డు సమావేశమైంది. ఇందులో పలు తీర్మానాలను ఆమోదించారు. ఆ వివరాలను సత్యనారాయణరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండల దీక్షలు చేపట్టే భక్తుల కోసం కొండపై విష్ణుపుష్కరిణి వద్ద దీక్షాపరుల మండపం, స్వామివారి నిత్యకల్యాణ మండపం, హైదరాబాద్-వరంగల్ హైవేపై రాయిగిరి వద్ద స్వాగత తోరణ నిర్మాణాలను రూ.55.95కోట్లతో చేపట్టడానికి ట్రస్ట్ బోర్టు ఆమోదించింది. ఈ మూడు నిర్మాణాలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ సత్యనారాయణరెడ్డి తన సొంత నిధులను అందిస్తున్నట్లుగా ప్రకటించారు. కొండపై శంఖు, చక్ర, నామాల విద్యుత్ బల్బుల బోర్డును పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీనికోసం రూ.85లక్షలను సమకూర్చడానికి ధర్మకర్త కొణిదెల సురేఖ ముందుకు వచ్చారు. మరోవైపు, పెద్దగుట్ట టెంపుల్ సిటీపై వేదపాఠశాల, విశ్వవిద్యాలయంతో పాటు 40ఎకరాల్లో మోడల్ గోశాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. స్వామివారి భక్తులకు ప్రస్తుతం అందిస్తున్న అన్నప్రసాదాన్ని 2వేల మందికి పెంచారు.
తిరుమల తరహాలో టీసీఎస్ సహకారలంతో ఆన్‌లైన్ సేవలు, టికెట్ వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించారు. ఇక ఆలయ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం కోసం ఐఎస్‌బీఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) సంస్థను కన్సల్టెంట్‌గా నియమించడానికి ట్రస్టు బోర్డు ఆమోదం తెలియజేసింది. దేవస్థాన విద్యుత్ వినియోగ వ్యయభారం తగ్గింపు కోసం 4 మెగావాట్ల సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వృద్ధులు, పిల్లల సౌలభ్యం కోసం కొండకింద వసతి గదుల వద్ద రూ.9 లక్షలతో అదనంగా కల్యాణ కట్ట నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా దాతలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి కొండపై వేంచేపు మండపం పక్కన దాతల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా, యాదగిరిగుట్ట ఆలయంలో ప్రొటోకాల్ దర్శనాలను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.