Share News

‘కడ లుంగీలకు’ కష్టాలు

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:17 AM

పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం సెగలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని మాస్టర్‌ వీవర్స్‌ను తాకాయి. కడ లుంగీలను ఉత్పత్తి చేసే వీరంతా తీవ్ర నష్టాలకు గురవుతున్నారు.

‘కడ లుంగీలకు’ కష్టాలు

  • యుద్ధం సెగతో పశ్చిమాసియాకు నిలిచిన ఎగుమతులు

  • 25వేల మంది నేత కార్మికులకు ఉపాధి కరువు

యాదాద్రి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం సెగలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని మాస్టర్‌ వీవర్స్‌ను తాకాయి. కడ లుంగీలను ఉత్పత్తి చేసే వీరంతా తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. హర్మోజ్‌ జలసంధిలో జలరవాణా నిలిచిపోవడంతో.. కార్మికుల ఉత్పత్తులు గోదాముల్లో పేరుకుపోతున్నాయి. పక్షం రోజులుగా మరమగ్గాలపై వీటి తయారీని పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. వీరు నేసే సుభయ బ్రాండ్‌ కడ లుంగీలకు ఆ దేశాల్లో ప్రత్యేక ఆదరణ ఉంది. అక్కడి ప్రజల వస్త్రధారణలో వీటిది ప్రత్యేక స్థానం. దాదాపు నలభై ఏళ్లుగా ఇక్కడి నుంచి వీటిని ఎగుమతి చేస్తున్నారు. యుద్ధం ప్రభావంతో .. వీటిపై ఆధారపడ్డ 25వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా రాజాపేట, ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ మండలాల్లో మరమగ్గాలపై వీటిని ఉత్పత్తిచేస్తారు. దాదాపు ప్రతీ ప్రాంతంలో 5-10మంది మాస్టర్‌ వీవర్స్‌ తమ పెట్టుబడులతో నూలు, రసాయనాలు, రంగులను పవర్‌లూమ్‌ కార్మికులకు అందజేస్తారు. వీరి ఉత్పత్తుల ఆధారంగా ఒక్కొక్కరికి రూ.600-1000 కూలీ గిట్టుబాటు అవుతుంది. జిల్లావ్యాప్తంగా 5వేల మరమగ్గాలపై దాదాపు 25వేల మంది రూ.15కోట్ల విలువైన లుంగీలను తయారవుతాయి. వీటికి ప్రధానమైన మార్కెట్‌గా పశ్చిమాసియాతో పాటు తూర్పు ఆఫ్రికా, ఉగాండా, కెన్యా దేశాలున్నాయి. ‘ప్రభుత్వం పవర్‌లూమ్‌ పరిశ్రమను ఆదుకోవాలి. కార్మికులకు సంక్షేమ పథకాలు, నూలు, రసాయనాలపై రాయితీలు ఇవ్వాలి’ అని రఘునాధపురంలోని పవర్‌లూమ్‌ యజమాని కటకం వెంకటేష్‌, వీవర్‌ గాడిపల్లి శ్రవణ్‌కుమార్‌ కోరారు.

Updated Date - Mar 12 , 2026 | 05:17 AM