యాదాద్రి చీఫ్ ఇంజనీర్ సస్పెన్షన్
ABN , Publish Date - Oct 16 , 2026 | 04:18 AM
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (వైటీపీఎస్) చీఫ్ ఇంజనీర్ బి.సురేశ్నాయక్పై సస్పెన్షన్ వేటు పడింది.
విధుల్లో నిర్లక్ష్యం, పర్యవేక్షణా లోపమే కారణం!
ఉత్తర్వులు జారీ చేసిన జెన్కో సీఎండీ హరీశ్
హైదరాబాద్/దామరచర్ల/మిర్యాలగూడ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (వైటీపీఎస్) చీఫ్ ఇంజనీర్ బి.సురేశ్నాయక్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జెన్కో సీఎండీ ఎస్.హరీశ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యేవరకూ సస్పెన్షన్ కొనసాగనుందని, సస్పెన్షన్ కాలంలో మరెక్కడా ఉద్యోగం చేయడం లేదని ధ్రువీకరిస్తూ ప్రతినెలా టీజీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్‌కు ధ్రువీకరణ పత్రం అందజేయాలని, ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం పరిధిలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో రెండేళ్లుగా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మొత్తం ఐదు యూనిట్లు కాగా, నాలుగు యూనిట్ల నుంచి రోజుకు 3,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఐదో యూనిట్ పనులు కొనసాగుతున్నాయి. వైటీపీఎ్సకు బి.సురేశం్నాయక్ ఆరు నెలలుగా చీఫ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం, నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి సాధించడం, యూనిట్ల పనితీరు ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, థర్మల్ అండ్ ప్రాజెక్టుల డైరెక్టర్, థర్మల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పర్యవేక్షణలో రెండు నెలలుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 15 రోజులుగా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి పనుల పురోగతిని జెన్కో సీఎండీ హరీశ్ సైతం నెలకోసారి సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 14న అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఈ సురేశ్‌నాయక్ తన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు ప్రాధాన్య పనుల ప్రణాళిక, పర్యవేక్షణ, అమలులో లోపాలు ఉన్నట్లు సమీక్షలో గుర్తించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ సీఎండీ ఉత్తర్వులు జారీచేశారు.
సస్పెన్షన్‌ను రద్దు చేయాలి: వైటీపీఎస్ జేఏసీ
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజనీర్ బి.సురేశ్‌నాయక్ సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని వైటీపీఎస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం తెలంగాణ జెన్కో సీఎండీ హరీశ్‌కు వినతిపత్రం అందజేసింది. వైటీపీఎ్‌సలో బొగ్గు నిర్వహణ ప్లాంట్ నిర్దేశిత సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయకపోవడానికి కారణమైన సాంకేతిక లోపాలు, అసంపూర్తి పనులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు కోరారు. ఒప్పందం ప్రకారం ప్లాంట్‌కు సంబంధించిన డిజైన్, ఇంజనీరింగ్, యంత్రాల ఏర్పాటు, పరీక్షలు, ప్రారంభ కార్యకలాపాలను పూర్తి చేయాల్సిన బాధ్యత బీహెచ్‌ఈఎల్‌పై ఉందని తెలిపారు. వైటీపీఎస్ స్టేజ్-1 చీఫ్ ఇంజనీర్ సురేష్ ఈ ఏడాది జూలై 23న బాధ్యతలు స్వీకరించిన అనంతరం పెండింగ్ పనులు, డిజైన్ లోపాలు, సాంకేతిక సమస్యలను టీజీ జెన్కో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించే నాటికే ప్లాంటుకు సంబంధించిన అనేక నిర్మాణ, యంత్రాల ఏర్పాటు, ప్రారంభ కార్యకలాపాల పనులు అసంపూర్తిగా ఉన్నట్లు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్లాంట్ నిర్ధేశిత సామర్థ్యాన్ని సాధించలేకపోవడానికి చీఫ్ ఇంజనీర్‌ను బాధ్యుడిగా పరిగణిస్తూ సస్పెండ్ చేయడం భావ్యం కాదన్నారు.