Share News

యాదగిరిగుట్ట ఆలయంలో సిబ్బంది చేతివాటం!

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:03 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి సన్నిధిలో బంగారు, వెండి నాణేల విక్రయాల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. బంగారు, వెండి నాణేల...

యాదగిరిగుట్ట ఆలయంలో సిబ్బంది చేతివాటం!

  • బంగారు, వెండి నాణేల విక్రయాల్లో రూ.10లక్షల మేర అవకతవకలు

  • ప్రచారశాఖలో అనధికారికంగా పనిచేస్తున్న వ్యక్తే కారణం

  • విచారణకు ఉన్నతస్థాయి కమిటీ

యాదాద్రి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి సన్నిధిలో బంగారు, వెండి నాణేల విక్రయాల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. బంగారు, వెండి నాణేల (డాలర్ల)పై స్వామివారి ప్రతిమలు ముద్రిం చి భక్తులకు విక్రయిస్తుం టారు. ఏరోజుకారోజు బులియన్‌ మార్కెట్‌ ధరల ప్రకారం వీటి ధరను నిర్ణయిస్తారు. కానీ, కొంత కాలంగా నాణేల విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ లోపించింది. ఆ విభాగంలో విధులు నిర్వహించిన సిబ్బంది చేతివాటం కారణంగా స్టాక్‌ రిజిస్టరులో విక్రయాలు, ఖజానాకు జమ చేసిన నగదు మధ్య భారీ వ్యత్యాసాలను ఆలయ అంతర్గత ఆడిట్‌ అధికారులు గుర్తించారు. సిబ్బంది లక్షల రూపాయల చేతివాటం ప్రదర్శించినట్లుగా తేల్చారు. దీంతో గురువారమే ఆలయ ఈవోగా భాద్యతలు చేపట్టిన ఐఏఎస్‌ అధికారి భవానీ శంకర్‌.. ఈ అక్రమాలపై ఉన్నతస్థాయి అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.

అనధికారికంగా విధులు నిర్వర్తించే వ్యక్తే..

బంగారు, వెండి నాణేలతో పాటు స్వామివారి సాహిత్యం, క్యాలెండర్లు, డైరీలను ఆలయ ప్రచార శాఖ ద్వారా భక్తులకు విక్రయిస్తుంటారు. ఏడాది క్రితం బదిలీపై యాదగిరిగుట్టకు వచ్చిన జూనియర్‌ అసిస్టెంట్‌ రామచంద్రశేఖర్‌ ఈ శాఖలో పనిచే స్తున్నారు. ఆయన అనారోగ్యానికి గురికాగా, కుమారుడు కౌశిక్‌ కొద్ది నెలలుగా అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నాడు. అధికారులు మానవతా దృక్పథంతో చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో కౌశిక్‌ చేతివాటం ప్రదర్శించి రూ.10లక్షల విలువగల నాణేలను విక్రయించి, ఖజానాకు జమ చేయలేదని తెలుస్తోంది.

Updated Date - Jan 30 , 2026 | 04:03 AM