ఆ గ్రామాలను కదిలిస్తే హైదరాబాద్ నోట్లో మట్టే..
ABN , Publish Date - Aug 06 , 2026 | 06:16 AM
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాటిపర్తి, మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద గ్రామాలతో పాటు మర్లకుంట, మంగగడ్డ తండాల రైతుల అంగీకారం లేని భూములన్నింటినీ భూసేకరణ నుంచి పూర్తిగా మినహాయుంచాలని..
4 ఊర్ల నుంచే నగరానికి పాలు, కూరగాయలు.. వాటిని భూసేకరణ నుంచి మినహాయించాలి
టీజాక్, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాటిపర్తి, మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద గ్రామాలతో పాటు మర్లకుంట, మంగగడ్డ తండాల రైతుల అంగీకారం లేని భూములన్నింటినీ భూసేకరణ నుంచి పూర్తిగా మినహాయుంచాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజాక్), ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆ గ్రామాలను కదిలిస్తే హైదరాబాద్ నోట్లో మట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో గ్రామం నుంచి రోజుకు 6 వేల నుంచి 10 వేల లీటర్ల పాలు, వందల టన్నుల తాజా కూరగాయలు, ఆకుకూరలు నగరానికి సరఫరా అవుతున్నాయని చెప్పారు. అలాంటి పల్లెలను అభివృద్ధి పేరుతో ధ్వంసం చేయడం వల్ల నగరానికి ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడుతుందన్నారు. తద్వారా పోషకాహార లోపంతో తలెత్తే ఆరోగ్య సమస్యలు నగరవాసుల్లో తీవ్రమవుతాయని అభిప్రాయపడ్డారు. ఫార్మా, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులపై గత నెల 5న తాటిపర్తిలో టీజాక్, ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ ప్రతినిధులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఆ నివేదికను బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జ్యూరీ సభ్యులు ఎస్.జీవన్‌కుమార్, వేమన వసంతలక్ష్మి, ప్రొఫెసర్ విజయ్, విశ్రాంత తహసీల్దార్ వి.బాలరాజ్ తదితరులు విడుదల చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. తాము నిర్వహించిన బహిరంగ విచారణకు 4 గ్రామాల నుంచి 600 మందికిపైగా రైతులు హాజరైనట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో అదే భూసేకరణ కొనసాగించడం శోచనీయమన్నారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై స్థానికులు చాలా ఆగ్రహంతో ఉన్నారని.. ఫార్మాసిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తూ అధికారిక జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలను ధిక్కరించి, గ్రామసభలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. అధికారులు వందలాది మంది పోలీసులతో వచ్చి జేసీబీలు, హిటాచీలతో పంటలను ధ్వంసం చేస్తున్నారని రైతులు కన్నీటి పర్యంతమయ్యారని వివరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల కడుపు కొడతారా అని వారు నిలదీశారు.