ఇలాగైతేనే అప్పు ఇస్తాం!
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:13 AM
తెలంగాణలో వైద్య రంగంలో సమూల మార్పుల కోసం రుణం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును కోరింది. రాష్ట్రంలో ప్రాధాన్య ఆరోగ్య సేవల వినియోగం, నాణ్యతను పెంచడం కోసం రూ.4150 కోట్లు అప్పుగా ఇవ్వాలని ..
114 గిరిజన గ్రామాలకు వైద్యం అందేలా ప్రణాళిక రూపొందించాలి
ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సు పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
4150 కోట్ల రుణంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు షరతులు
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వైద్య రంగంలో సమూల మార్పుల కోసం రుణం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును కోరింది. రాష్ట్రంలో ప్రాధాన్య ఆరోగ్య సేవల వినియోగం, నాణ్యతను పెంచడం కోసం రూ.4150 కోట్లు అప్పుగా ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ నిధులతో ‘తెలంగాణ స్ట్రాటజిక్ విజన్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ హెల్త్ కేర్’ అనే ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ అప్పు ఇచ్చే ముందు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు బృందం.. ‘పర్యావరణ, సామాజిక వ్యవస్థల అంచనా (ఈఎ్‌సఎ్‌సఏ)’ పేరుతో సోమవారం ముసాయిదా నివేదికను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణ, సామాజిక ప్రమాదాలు ఒక మోస్తరుగానే ఉంటాయని ఈఎ్‌సఎ్‌సఏ నివేదిక తేల్చింది. ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణ ఆరోగ్య వ్యవస్థ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు వంటి అసాంక్రమిక వ్యాధులు; మహిళలు, వృద్ధుల సంరక్షణలో లోపాలు, పేదలపై పెరుగుతున్న వైద్య ఖర్చుల భారాన్ని ప్రధాన సమస్యలుగా గుర్తించింది. అటవీ ప్రాంతాల్లోని గిరిజనులకు వైద్యం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలినట్లు పేర్కొంది. సంచార వాహనాలు నడుపుతున్నట్లు చెబుతున్నా.. అవి మారుమూల గూడేలకు చేరడం లేదని నివేదిక పేర్కొంది. అయితే, కొన్ని కీలక ఆరోగ్య సూచీల్లో మాత్రం జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపింది. ఐదేళ్లలోపు పిల్లలు, శిశువులు, నవజాత శిశు మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని వివరించింది. మాతాశిశు సంరక్షణలోనూ మంచి పురోగతి సాధించినట్లు పేర్కొంది. గ్రామీణ వైద్యానికి వెన్నెముకగా నిలుస్తున్న ఆశా వర్కర్లపై పనిభారం పెరిగిపోయిందని తెలిపింది. ఈ ముసాయిదాపై ప్రజలు, నిపుణుల నుంచి సలహాలు స్వీకరించనున్నారు. లోపాలు సరిదిద్దుకుంటామని ప్రభుత్వం హామీ ఇస్తేనే రూ.4150 కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు దశలవారీగా మంజూరు చేస్తుంది.
ప్రపంచ బ్యాంకు షరతులివే..
గిరిజన ప్రాంతాల్లోని 114 గ్రామాలకు వైద్యం అందేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి.
ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సు పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణను కట్టుదిట్టం చేయాలి. ఒకే విధమైన ఒప్పందాలు ఉండాలి.
వృద్ధుల కోసం ఆస్పత్రుల్లో ర్యాంపులు, వెస్ట్రన్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలి.
ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయాలి.
ఆరోగ్య శాఖ సిబ్బందికి నిరంతర శిక్షణ ఇవ్వాలి.