మాటలు.. మంటలు
ABN , Publish Date - May 08 , 2026 | 01:01 AM
నాయకుల మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. జ్యువెలరీ షాపు దోపిడీ అనంతరం బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు రాజకీయ కారణాలతో మాట్లాడిన మాటలు, చేసిన వాఖ్యలు కరీంనగర్‌లో ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాలపై
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
నాయకుల మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. జ్యువెలరీ షాపు దోపిడీ అనంతరం బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు రాజకీయ కారణాలతో మాట్లాడిన మాటలు, చేసిన వాఖ్యలు కరీంనగర్‌లో ఎమ్మెల్యే, ఎంపీ కార్యాలయాలపై దాడులు, ప్రతిదాడులకు కారణమయ్యాయి. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు బాహాబాహీకి దిగడంతో కరీంనగర్ రణరంగంగా మారింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాం్ కార్యాలయం, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వాహనం ధ్వంసమై పోగా ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు దాడుల్లో, పోలీసులు చెదరగొడుతున్న సందర్భంలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ శనివారం కరీంనగర్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది.
పోటాపోటీగా విమర్శలు
పీఎంజే జ్యువెలర్స్‌లో ఐదుగురు సాయుధులు తుపాకులతో బెదిరించి నగలు దోచుకుపోయిన సంఘటన నేపథ్యంలో బీఆర్‌ఎస్ట్ కార్యనిర్వహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీ రామారావు సంఘటన స్థలానికి వచ్చి పోలీసు భద్రతావైఫల్యాలను ప్రశ్నిస్తూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంలో ఆయన కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌పై చేసిన కామెంట్స్ రాజకీయంగా వేడిని రగిలించాయి. ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో బండి సంజయ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించకుండా నాకేమి సంబంధమనడాన్ని తప్పుబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు ఒకటేనని, వారిద్దరి మధ్య కాందిశీకుల భూముల వ్యవహారం నడుస్తోందని, ఆయన సీఎం సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై బండి సంజయ్‌కుమార్ స్పందిస్తూ కేటీఆర్‌ను మనిషిపుట్టుకే పుట్టి ఉంటే కేసీఆర్‌కే పుడితే అంటూ కామెంట్ చేశారు. ఆయనను జంతువుకంటే హీనం అని కూడా వాఖ్యానించారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడడు అని అర్థం వచ్చేలా బండి సంజయ్ వాఖ్యానించడం బీఆర్‌ఎస్‌లో మంటలు రేపింది.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ దాడి
బండి సంజయ్ వాఖ్యల నేపథ్యంలో పాడి కౌశిక్‌రెడ్డి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బండి సంజయ్‌కుమార్‌ను తాము కూడా ఎవరికి పుట్టారో అనగలం కానీ సంస్కారం అడ్డువస్తుందని అన్నారు. బండి సంజయ్‌కుమార్ కూడా తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తినడంతోనే తలపై వెంట్రుకలు పోయాయనే అనుమానం వస్తుందని కామెంట్ చేశారు. ఈ వాఖ్యలు బీజేపీశ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. విలేకరుల సమావేశం అయిపోయి మీడియా ప్రతినిధులతో కౌశిక్‌రెడ్డి అక్కడే చిట్‌చాట్ చేస్తుండగా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా దూసుకొని వచ్చి ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలోని కౌశిక్‌రెడ్డి కారును, కార్యాలయ కిటికీల అద్దాలను, ఫర్నీచర్, పూలమొక్కల కుండీలను ధ్వంసం చేశారు. అప్రమత్తమైన కౌశిక్‌రెడ్డి గన్‌మెన్లు బీజేపీ శ్రేణుల గుంపును చూడగానే కౌశిక్‌రెడ్డిని ఒక రూమ్‌లోకి తీసుకొని వెళ్లి గడియపెట్టి అడ్డుగా నిలుచున్నారు. ఈ ఘటన అనంతరం బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎంపీ బండి సంజయ్‌కుమార్ వైపు వెళ్తుండగా పోలీసులు మధ్యలోనే అడ్డగించి అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈఘటనల్లో ఇరుపార్టీల కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు కౌశిక్‌రెడ్డిని హుజూరాబాద్‌కు ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్‌తో పంపించారు. బీజేపీ కార్యకర్తలు కరీంనగర్ నుంచి హుజూరాబాద్‌కు వెళ్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.
శాంతి భద్రతలను పరిరక్షించాలని ప్రజల డిమాండ్
జిల్లా కేంద్రంలో ఐదుగురు దుండగలు తుపాకులతో కాల్పులు జరిపి జ్యువెలరీ షాపును దోపిడీ చేసి వెళ్లారు. జిల్లా కేంద్రంలో భద్రతను పెంపొందించడానికి ఏమి చేయాలో నిర్మాణాత్మక సూచనలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో సైబర్ నేరాలు పెరుగడం, గన్ కల్చర్ కూడా పెరుగుతున్నదని, గంజాయి విచ్చలవిడిగా లభిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. జ్యువెలరీషాపు దోపిడీ ఘటనలో ఒకవైపు దర్యాప్తు సాగుతుండగానే మరో సంఘటన అల్గునూర్ చౌరస్తాలో హైకోర్టుకు చెందిన ప్రముఖన్యాయవాదిని యూపి నెంబర్ ఉన్నకారులో వచ్చిన నలుగురు సాయుధులు అడ్డగించి, కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన తప్పించుకొని పోలీసు స్టేషన్‌కు వెళితే ఎల్‌ఎండీ పోలీసులు ఆయుధాలతో వచ్చినట్లుగా ఫిర్యాదులో పేర్కొంటే కేసు నమోదు చేయమని అనడంతో ఆయన హైదరాబాద్ వెళ్లి కోర్టులో ఫిర్యాదు ఫైల్ చేశారని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపిస్తున్న అంశం కూడా ఇక్కడ కలవరానికి కారణమవుతున్నది. యూపీ, బిహార్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ గ్యాంగులు ఇక్కడ సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టి వీటిని అదుపుచేయాలని ప్రజలు కోరుతున్నారు. నాకాబందీ తరచుగా నిర్వహిస్తూ నేరాలను అదుపు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నాయకులు రాజకీయ కారణాలతో గొడవలకు దిగకుండా జిల్లాలో నేర సంస్కృతి తగ్గించేందుకు తమవంతు కృషిచేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అధికార కాంగ్రెస్‌నేతలు బీఆర్‌ఎస్, బీజేపీ దాడులు, ప్రతిదాడులను విమర్శిస్తూ కాలం వెళ్లదీయకుండా జరిగిన సంఘటన, భద్రతా వైఫల్యాలను సమీక్షించుకొని వాటిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.