Share News

మహిళల్లో నిరుద్యోగం తగ్గుతోంది: కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:16 AM

మహిళల ఉపాధి అవకాశాలు దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

మహిళల్లో నిరుద్యోగం తగ్గుతోంది: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్ర జ్యోతి): మహిళల ఉపాధి అవకాశాలు దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ‘ఆర్థిక సర్వే 2025-26’లో మహిళల నిరుద్యోగం పెరుగుదలపై ఇచ్చిన గణాంకాలను శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. మహిళా సాధికారతలో భారత్‌ సాధిస్తున్న ప్రగతిని ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి వివరించారు. 2017-18లో కేవలం 23.3 శాతంగా ఉన్న మహిళా కార్మిక భాగస్వామ్య రేటు, 2023-24 నాటికి 41.7 శాతానికి పెరిగిందన్నారు. అదే సమయంలో మహిళల్లో నిరుద్యోగ రేటు 5.6 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అమలు చేసిన వినూత్న కార్యక్రమాలే ఈ పురోగతికి కారణమని కిషన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. నగరాల్లో సురక్షిత రవాణా సౌకర్యాలు, రాత్రి వేళల్లో పనిచేసే మహిళల రక్షణకు తీసుకున్న జాగ్రత్తలు, అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలు మహిళలు ఉపాధి వైపు అడుగులు వేయడానికి దోహదపడ్డాయని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Jan 31 , 2026 | 04:16 AM