municipalities : పురపాలికల్లో మహిళా ఓటర్లే అధికం
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:19 AM
ప్రభుత్వం మునిసిపల్ ఎన్నికలకు సమాయ త్తం అవుతున్న నేపఽథ్యంలో ఎన్నికలకు సంబంఽధించిన కీలక ఘట్టం మొదలైంది.
మహిళలు 1.57లక్షలు, పురుషులు 1.48లక్షల మంది
జిల్లాలోని ఏడు మునిసిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
5వరకు అభ్యంతరాల స్వీకరణ, 10న తుది జాబితా
రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ
నకిరేకల్ మునిసిపల్ పాలకవర్గం గడువు మే వరకు
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): ప్రభుత్వం మునిసిపల్ ఎన్నికలకు సమాయ త్తం అవుతున్న నేపఽథ్యంలో ఎన్నికలకు సంబంఽధించిన కీలక ఘట్టం మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో ని ఏడు మునిసిపాలిటీలకు సంబంధించిన వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. ఈ జాబితా ప్రకా రం పురపాలికల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పురుషులు 1.48లక్షల మంది ఉండ గా, మహిళలు 1.57లక్షల మంది ఉన్నారు.
మునిసిపల్ ఓటర్ల జాబితాను ప్రకటించిన అధికారులు వాటిని మునిసిపల్ కార్యాలయంతో పాటు తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్ కార్యాలయం నోటీస్ బోర్డులపై ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాతో పాటు ఇతర వివరాల్లో తప్పులు ఉంటే ఈనెల 5 వరకు అభ్యంతరా లు స్వీకరించి, 10వ తేదీన తుది జాబితాను ప్రకటిస్తారు. జిల్లాలో మొత్తం 8 మునిసిపాలిటీలు ఉండ గా నకిరేకల్ మునిసిపాలిటీ పాలకవర్గం గడువు ఈ ఏడాది మే వరకు ఉంది. దీంతో ఆ మునిసిపాలిటీకి సంబంధించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేయలేదు. శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితా ఆధారంగా మునిసిపాలిటీల చట్టం-2019 ప్రకారం వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు రూపొందించారు. ఈనెల 5వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా స్థాయిలో 6వ తేదీన సమావేశం నిర్వహించి తుది ఓటర్ల జాబితాను 10వ తేదీన వెల్లడించనున్నారు.
ఏడు మునిసిపాలిటీల్లో 3లక్షల మందికిపైగా
జిల్లాలోని ఏడు మునిసిపాలిటీల ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 3,06,074మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 1,48,353 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,57,676మంది, ఇతరులు 45 మంది ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇదిలా ఉండగా, మునిసిపల్ రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మునిసిపాలిటీల చైర్మన్ స్థానాలకు, వార్డుల వారీగా కౌన్సిలర్ల స్థానాలకు రిజర్వేషన్లు ఎలా ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో మునిసిపల్ చట్టం ప్రకారం వరుసగా రెండు సార్లు ఒకే రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీల మాదిరిగానే రిజర్వేషన్ మారుస్తుందా? లేదంటే మునిసిపాలిటీలో పాత రిజర్వేషన్లు అమలు చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మునిసిపాలిటీల్లో రిజర్వేషన్ మార్పుపై చట్టాన్ని చేస్తే కొత్త రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మునిసిపాలిటీల్లో పాలకవర్గాల పదవీకాలం గత ఏడాది జనవరి 27తో ముగిసింది. అప్పటి నుంచి మునిసిపాలిటీల్లో ప్రత్యేక పాలన సాగుతోంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో సంక్రాంతి పండుగ తరువాత షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలోని ఏడు మునిసిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ల జాబితా ఇలా..
మునిసిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
నల్లగొండ 67,235 72,041 25 1,39,301
మిర్యాలగూడ 45,128 47,878 14 93,020
చిట్యాల 5,929 6,188 01 12,118
చండూరు 5,652 5,717 01 11,370
నందికొండ 6,437 7,065 01 13,503
హాలియా 6,270 6,529 02 12,801
దేవరకొండ 11,702 12,258 01 23961
మొత్తం 1,48,353 1,57,676 45 3,06,074