Share News

మహిళా రిజర్వేషన్‌.. మోదీ గ్యారంటీ

ABN , Publish Date - Jun 13 , 2026 | 06:49 AM

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లు ఇచ్చి తీరుతామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్‌.. మోదీ గ్యారంటీ

  • మన వద్ద వ్యాక్సిన్లే కాదు.. బ్రహ్మోస్‌లూ ఉన్నాయి

  • అయోధ్యలో రామమందిరం నిర్మించి చూపాం

  • రూ.39 వేల కోట్లకు మన రక్షణ ఎగుమతులు

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణకు ఎక్కువ

  • నిధులిచ్చాం: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడి

  • మరోసారి మోదీయే ప్రధాని: రాంచందర్‌రావు

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లు ఇచ్చి తీరుతామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. మహిళలకు రాజకీయ భాగస్వామ్యం పెంచేవరకూ విశ్రమించబోమని.. ఇది మోదీ గ్యారంటీ అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని.. దానివల్ల సమయం, ఖర్చు ఆదా అవుతాయని ఆయన తెలిపారు. అన్ని పక్షాలనూ ఒప్పించి జమిలి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. శుక్రవారం సికింద్రాబాద్‌లో మేధావులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్‌నాథ్‌సింగ్‌.. బీజేపీ ఎప్పుడూ రాబోయే ఎన్నికల గురించి కాక రాబోయే తరం గురించి ఆలోచిస్తుందని చెప్పారు. ‘‘ఏ వ్యాధికి ఏ మందు కావాలో అది మన వద్ద ఉంది.. వ్యాధుల నుంచి ప్రపంచదేశాలను రక్షించే వ్యాక్సిన్‌ ఎంత ఉందో, శత్రువులను తుత్తునియలు చేసే బ్రహ్మోస్‌ కూడా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మన రక్షణ రంగ ఎగుమతులు రూ.39 వేల కోట్లకు చేరాయని, ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాలకు ఈ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని రాజ్‌నాథ్‌ వివరించారు. వచ్చే ఐదేళ్లలో మన ఎగుమతులను 2 ట్రిలియన్‌ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


‘‘మోదీ అధికారం చేపట్టిన తర్వాత గడచిన 12 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో మనదేశ ప్రతిష్ఠ పెరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనదేశం ఏం చెబుతుందా? అని ఆసక్తిగా చూసే స్థాయికి ఎదిగింది. మోదీ అధికారం చేపట్టిన తర్వాత 38 దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒకప్పుడు ఆర్టికల్‌ 370పై మాట్లాడాలంటే భయపడేవారు. కానీ, మోదీ ఆ ఆర్టికల్‌ను రద్దు చేశారు. ఇప్పుడు జమ్ముకశ్మీర్‌కు పరిశ్రమలు వస్తున్నాయి. లాల్‌చౌక్‌లో జాతీయ జెండా రెపరెపలాడుతోంది. దేశవ్యాప్తంగా నక్సలిజం అంతమైంది’’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు. ‘‘అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని చెప్పి చేసి చూపించాం. అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


తెలంగాణకు విరివిగా..

హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దేశ ఐక్యతను కాపాడారని పేర్కొంటూ.. ఆయన స్ఫూర్తితోనే మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 12 ఏళ్లలో తెలంగాణాకు జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పెద్దఎత్తున ఇచ్చామన్నారు. ‘‘ఉమ్మడి ఏపీలో రైల్వే కేటాయింపులు రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువ ఉండేవి. ఇప్పుడు తెలంగాణాకు రైల్వే బడ్జెట్‌ కేటాయింపులు రూ.5,500 కోట్లు. ఐదు వందేభారత్‌, 6 అమృత్‌ భారత్‌ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ప్రధాని మోదీ, ఇటీవలే రూ.1700 కోట్ల పీఎం మిత్రా టెక్స్‌టైల్‌ పార్క్‌ మంజూరు చేశారు.’’ అని గుర్తుచేశారు. కాగా.. మూడేళ్ల తర్వాతా ప్రధానిగా మోదీయే ఉంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. దేశభద్రత విషయంలో రాజీపడని నాయకత్వం, నిర్ణయాత్మక పాలన వల్ల దేశం సురక్షితంగా ఉందని పేర్కొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 06:49 AM