Share News

మోదీ పంజా విసరడం తథ్యం

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:31 AM

పులి పంజా విసిరేటప్పుడు ఒక అడుగు వెనక్కు వేస్తుందని, ప్రధాని మోదీ కూడా మహిళా రిజర్వేషన్‌ అంశంలో ఒక అడుగు వెనక్కి వేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

మోదీ పంజా విసరడం తథ్యం

  • వచ్చే ఎన్నికల్లోపే మహిళా రిజర్వేషన్ల అమలు ఖాయం

  • బీజేపీ మహిళా ఆక్రోశ్‌ పాదయాత్రలో కేంద్ర మంత్రి బండి

  • ఏప్రిల్‌ 17 చీకటి రోజు: కిషన్‌రెడ్డి

  • కాంగ్రెస్‌ తీరు కౌరవ సభను తలపించింది: రాంచందర్‌రావు

కవాడిగూడ/హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): పులి పంజా విసిరేటప్పుడు ఒక అడుగు వెనక్కు వేస్తుందని, ప్రధాని మోదీ కూడా మహిళా రిజర్వేషన్‌ అంశంలో ఒక అడుగు వెనక్కి వేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. మోదీ పంజా విసరడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లోపే మహిళా రిజర్వేషన్లను అమలు తథ్యమని స్పష్టం చేశారు.హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ గురువారం నిర్వహించిన మహిళా ఆక్రోశ్‌ పాదయాత్ర సభలో సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు అంశంలో కాంగ్రెస్‌ తీరును నిరసిస్తూ హైదరాబాద్‌, దోమల్‌గూడలోని ఏవీ కాలేజీ నుంచి ఇందిరాపార్కు వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు, కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌, ఎంపీలు ఈటల రాజేందర్‌, డీకే అరుణ తదితర నేతలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. యాత్ర అనంతరం అనంతరం ఇందిరా పార్క్‌ వద్ద నిర్వహించిన సభలో సంజయ్‌ మాట్లాడుతూ.. పార్లమెంట్‌ లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందుతుందని సంబురాలకు సిద్ధమైన దేశ మహిళల ఆశలపై ప్రతిపక్షాలు నీళ్లు చల్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మహిళా ద్రోహి అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డిని తిట్టని మహిళ లేదన్నారు. మహిళా బిల్లును అడ్డుకున్న రేవంత్‌ రెడ్డిని గద్దె దించాలని, అందులో భాగంగా ఇంటికి వచ్చే కాంగ్రెస్‌ నేతలను నిలదీయండని మహిళలకు సంజయ్‌ పిలుపునిచ్చారు. మహిళా బిల్లును అడ్డుకునే పార్టీలన్నీ కుటుంబ వారసత్వ పార్టీలేనని, సాధారణ మహిళలకు చట్టసభల్లో అడుగుపెట్టే అర్హత లేదని కాంగ్రెస్‌, డీఎంకే, ఎస్పీ, ఎన్సీపీ పార్టీలు చెబుతున్నాయని సంజయ్‌ ఆరోపించారు.


ఇక, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టి, మహిళా లోకానికి అన్యాయం చేయాలని చూసిన కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి, వారి మిత్ర పక్ష నేత స్టాలిన్‌, ఎంఎఐం నేత అసదుద్దీన్‌, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ఏప్రిల్‌ 17 చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. మహిళలకే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు గండికొడుతూ కాంగ్రెస్‌ చేస్తున్న రాజకీయాన్ని ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు మాట్లాడుతూ పార్లమెంటులో మహిళా బిల్లుపై కాంగ్రెస్‌ నేతలు వ్యవహరించిన తీరును చూస్తే కౌరవుల సభ గుర్తుకు వస్తోందని వ్యాఖ్యానించారు. ద్రౌపదీ వస్త్రహరణం సమయంలో కౌరవులు నవ్వుతూ ఏ విధంగా అవమానించారో.. నేడు మహిళల హక్కుల బిల్లు ఓడిపోతుంటే కాంగ్రెస్‌ నాయకులు అదే విధంగా సంబరాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఉనికి కోల్పోతామోనన్న భయంతోనే కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు బిల్లును అడ్డుకున్నాయని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.

Updated Date - Apr 24 , 2026 | 04:31 AM