Share News

బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్లుకు పునర్విభజనతో ముడి: ఆది శ్రీనివాస్‌

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:50 AM

రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ మహిళా బిల్లును పునర్విభజనతో ముడిపెట్టిందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ దుయ్యబట్టారు. బుధవారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ..

బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్లుకు పునర్విభజనతో ముడి: ఆది శ్రీనివాస్‌

  • డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం: మల్లు రవి

  • జీవన్‌రెడ్డి రాజకీయ జీవితం క్లోజ్‌: బల్మూరి

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ మహిళా బిల్లును పునర్విభజనతో ముడిపెట్టిందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ దుయ్యబట్టారు. బుధవారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్‌ ఫార్ములాను బీజేపీ, బీఆర్‌ఎస్‌ అడ్డుకోవడం దారణమన్నారు. పునర్విభజనపై బీఆర్‌ఎస్‌ స్పష్టమైన అభిప్రాయం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీరని నష్టం జరుగుతుందని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం మొదటి నుంచి కృషి చేసింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చే బిల్లులో చాలా లోపాలున్నాయన్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్‌, సీట్ల పెంపును చేపడితే ముఖ్యంగా ఎస్సీలకు అన్యాయం జరిగే అవకాశముందని చెప్పారు. 2026 జానాభా లెక్కల ప్రకారమే చేపట్టాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. పార్లమెంట్‌ స్థానాల పెంపు ప్రోరెటా ప్రకారం చేస్తే.. దక్షిణ భారతదేశం అగ్నిగుండం అయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పెట్టిన రాజకీయ భిక్షతో ఎదిగిన జీవన్‌రెడ్డి.. ఇప్పుడదే పార్టీని విమర్శించడం హాస్యాస్పదమని ప్రభుత్వ విప్‌ బల్మూరి వెంకట్‌ మండిపడ్డారు. మేడిగడ్డ వైఫల్యాలపై కేసీఆర్‌ను నిలదీయాల్సింది పోయి.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం జీవన్‌రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. బీఆర్‌ఎ్‌సలో చేరడంతోనే ఆయన రాజకీయ జీవితం ముగిసిందని విమర్శించారు. అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్‌ ఫోన్ల కొనుగోలు విషయంలో మంత్రి సీతక్కపై సత్యవతి రాథోడ్‌ చేసిన విమర్శలను కాంగ్రెస్‌ నేత బండ్రు శోభారాణి ఖండించారు. కేంద్రం నిర్ణయించిన ధర కంటే తక్కువకే ఫోన్లు కొనుగోలు చేసి ప్రభుత్వం నిధులను ఆదా చేసిందని.. సీతక్క నిజాయతీని శంకించడం సరికాదని వ్యాఖ్యానించారు.

Updated Date - Apr 16 , 2026 | 03:50 AM