67 శాతం చైర్‌పర్సన్లు మహిళలే
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:04 AM
లేచింది మహిళా లోకం... దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అని అప్పుడెప్పుడో సినీ కవి మహిళా చైతన్యాన్ని కీర్తించారు. కానీ.. తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది....
పురపాలికల్లో పెరిగిన ప్రాతినిధ్యం.. 76 మునిసిపాలిటీల్లో మహిళలే చైర్‌పర్సన్లు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ‘లేచింది మహిళా లోకం... దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అని అప్పుడెప్పుడో సినీ కవి మహిళా చైతన్యాన్ని కీర్తించారు. కానీ.. తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో మహిళలు అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే కాదు.. అనూహ్య రీతిలో చైర్‌పర్సన్ పీఠాలను సొంతం చేసుకున్నారు. గత ఎన్నికలో గెలిచిన మహిళల కంటే ఈసారి 16 శాతం మంది మహిళా చైర్‌పర్సన్లుగా అధికంగా ఉండడం విశేషం. అంతేకాదు... వీరిలో 43.32 శాతం మంది 40 ఏళ్ల లోపు మహిళలే కావడం గమనార్హం. రాష్ట్రంలో మునిసిపల్ చైర్మన్లుగా ఎన్నికైనవారిలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కుమార్తె గడ్డం అనన్య అత్యంత పిన్న వయస్కురాలు. 25 ఏళ్లకే ఆమె మునిసిపల్ చైర్‌పర్సన్ అయ్యారు. ఇక 7 మునిసిపల్ కార్పొరేషన్లలో మగ్గురు మేయర్లు, ముగ్గురు డిప్యూటీ మేయర్లు మహిళామణులే. ఈ కార్పొరేషన్లలోనూ 43శాతం స్థానాలను మహిళలే చేజిక్కించుకున్నారు. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, క్యాతన్‌పల్లి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మునిసిపాలిటీల చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నిక వాయిదా పడింది. అంటే... 113 మునిసిపాలిటీలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ 113 మునిసిపాలిటీలకు గాను 76 చోట్ల మహిళా చైర్‌పర్సన్లే ఎన్నికయ్యారు. అంటే 67.25శాతం వాటా వీరిదే. ఇందులో 40 ఏళ్ల లోపు మహిళా చైర్‌పర్సన్లు 33(43.42శాతంగా)మంది ఉన్నారు. 2020లో 111 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అప్పుడు 57 మంది (51.35శాతం) మహిళలు చైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యారు. అప్పటితో పోలిస్తే ఈ సారి 16శాతం మేర ఎక్కువగా మహిళా చైర్‌పర్సన్లు అధికార పీఠమెక్కారు. పైగా... మునిసిపల్ వైస్ చైర్‌పర్సన్ల పదవుల్లోను మహిళలు చెప్పుకోదగ్గ వాటా దక్కించుకున్నారు. 113 మునిసిపాలిటీల్లో 54 మంది మహిళలు వైస్ చైర్‌పర్సన్లుగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో 30 మంది మాత్రమే మహిళలు వైస్ చైర్‌పర్సన్లుగా ఎన్నికవగా.. ఇప్పుడది 20.76 శాతం మేర పెరిగింది. 7 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 414 డివిజన్లు ఉండగా.. 223 డివిజన్లలో మహిళలే కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. ఈ లెక్కన 53.86 శాతం స్థానాల్లో మహిళలే గెలుపొందారు. రిజర్వుడు స్థానాల్లోనే కాకుండా... జనరల్ స్థానాల్లోనూ మహిళలు సత్తా చాటుతుండడం రాజకీయ చైతన్యానికి నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.