Share News

Hyderabad Police Commissioner Sajjannar: ఎమర్జెన్సీ పరిస్థితే ఉంటే.. మీరు బయట తిరిగేవారా?

ABN , Publish Date - Jan 15 , 2026 | 05:17 AM

‘‘ఎమర్జెన్సీ పరిస్థితే ఉంటే మీరందరూ బయట ఉండేవారా? మీ అందరితో మాట్లాడేవాడినా? మీరందరూ కూడా లోపలే ఉండేవారు’’ అని నగర సీపీ వీసీ సజ్జనార్‌ విలేకరులతో అన్నారు!

Hyderabad Police Commissioner Sajjannar: ఎమర్జెన్సీ పరిస్థితే ఉంటే.. మీరు బయట తిరిగేవారా?

  • మీరందరూ కూడా లోపలే ఉండేవారు

  • మహిళా ఐఏఎస్‌ వ్యక్తిత్వహననం కేసులో విలేకరుల అరెస్టుపై హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌

  • పారిపోయేందుకు ప్రయత్నిస్తేనే అరెస్ట్‌ చేశాం.. విచారణకు వస్తామని చెప్పి ఫోన్లు ఆఫ్‌ చేశారు

  • విచారణకు పిలిస్తే రావాల్సిందే.. నోటీసు ఎందుకివ్వాలి?.. చానల్‌ సీఈవో ఎక్కడున్నా విచారణకు రావాలి

  • ఏ తప్పూ చేయకపోతే భయమెందుకు?: సజ్జనార్‌.. దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్‌

  • బ్యాంకాక్‌కు బయల్దేరిన ఒక చానల్‌ ఇన్‌పుట్‌ ఎడిటర్‌, రిపోర్టర్‌ అరెస్ట్‌.. మరో రిపోర్టర్‌కు నోటీసులు

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎమర్జెన్సీ పరిస్థితే ఉంటే మీరందరూ బయట ఉండేవారా? మీ అందరితో మాట్లాడేవాడినా? మీరందరూ కూడా లోపలే ఉండేవారు’’ అని నగర సీపీ వీసీ సజ్జనార్‌ విలేకరులతో అన్నారు! మహిళా ఐఏఎస్‌ అధికారిపై వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. వారు పోలీసు విచారణకు సహకరించకుండా పారిపోయే ప్రయత్నం చేస్తుండగా అరెస్ట్‌ చేశామని ఆయన చెప్పారు. మహిళా ఐఏఎస్‌ అధికారిపై దుష్ప్రచారం కేసులో దూకుడు పెంచిన సిట్‌.. ఆ కథనాన్ని ప్రసారం చేసిన ఒక టీవీ చానల్‌ ప్రతినిధులు దొంతు రమేశ్‌ (52) ఇన్‌పుట్‌ ఎడిటర్‌, సుధీర్‌ (39) ఆ చానల్‌ సచివాలయం రిపోర్టర్‌ను బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించింది. చానల్‌ పొలిటికల్‌ బ్యూరో రిపోర్టర్‌ పరిపూర్ణాచారిని అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం ఆయనకు నోటీసులు ఇచ్చి పంపించింది. దొంతు రమేశ్‌, సుధీర్‌లకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. అయితే, వారికి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడమేమిటని విలేకరులు సీపీని ప్రశ్నించగా.. ‘‘నోటీసులు ఎందుకు ఇవ్వాలి? పోలీసు విచారణకు పిలిస్తే రావాలి’’ అని ఆయన సమాధానమిచ్చారు. ‘తప్పుచేయకుంటే ఎందుకు భయపడుతున్నారు’ అని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు విచారణకు సహకరించాలని కోరారు. చానల్‌ సీఈవో పోలీసు విచారణకు హాజరు కావాలన్నారు. ‘‘రిపోర్టర్లు ఎందుకు పారిపోతున్నారు.


అప్పటికప్పుడు టికెట్లు బుక్‌ చేసుకొని బ్యాంకాక్‌కు పరారయ్యే యత్నం చేసినందుకే అరెస్ట్‌ చేశాం. మరో రిపోర్టర్‌ విచారణకు వస్తాననిచెప్పి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నారు, పారిపోయే అవకాశం ఉండటంతో అతడిని కూడా అరెస్ట్‌ చేశాం’’ అని తెలిపారు. మహిళా అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం క్రూరత్వమే అవుతుందని. ఇలాంటి అసత్య కథనాలు ప్రసారమైతే మహిళా అధికారులు సమాజంలో ఎలా పనిచేయగలుగుతారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌పై అవమానకరమైన వార్తలు రాసిన మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశామని.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు. ‘‘నోటీసులు ఇచ్చినపుడు రావాలి. విచారణకు హాజరుకాకపోతే ఎక్కడున్నా అరెస్ట్‌ చేసి, చట్టం ముందు హాజరు పరుస్తాం’’ అని సీపీ పేర్కొన్నారు.


అరెస్టు ఇలా..

మహిళా ఐఏఎస్‌ అధికారిపై దుష్ప్రచారం నేపథ్యంలో బీఎన్‌ఎ్‌స సెక్షన్‌ 75, 78, 79, 351 (1), 352, 61 (2), 238, సెక్షన్‌ 8, 4లతో కేసు నమోదు చేసిన సీసీఎస్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ కోసం జాయింట్‌ సీపీ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. సిట్‌ అధికారులు.. దొంతు రమేశ్‌పై ముందస్తుగా ‘ట్రావెల్‌ స్టాపింగ్‌ మెమో’ జారీ చేశారు. ఆయన మంగళవారం రాత్రి బ్యాంకాక్‌ వెళ్లేందుకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోగా.. ట్రావెల్‌ స్టాపింగ్‌ మెమో ఉండడంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆయన్ను గుర్తించి ప్రత్యేక దర్యాప్తు బృందానికి సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆయన్ను ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. రమేశ్‌, సుధీర్‌, చారి ఇళ్లు, కార్యాలయంలో పోలీసులు మంగళవారం రాత్రి, బుధవారం సోదాలు నిర్వహించారు. కార్యాలయంలోని హార్డ్‌ డిస్క్‌లు, ఇతర సాంకేతిక పరికరాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. బషీర్‌బాగ్‌ సీసీఎస్‌ కార్యాలయంలో సిట్‌ ఇన్‌చార్జ్‌ శ్వేత రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ ముగ్గురినీ ప్రశ్నించింది. ‘ఆఫ్‌ ది రికార్డ్‌’ ప్రోగ్రాంలో పరోక్షంగా పేర్కొన్న మహిళా ఐఏఎస్‌ ఎవరు? నల్లగొండ మంత్రి ఎవరు? దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎవరిచ్చారు? వారి వద్ద ఉన్న ఆధారాలేంటి? అనే విషయాలపై పోలీసులు వారిని ప్రశ్నించి, వాంగ్మూలాలు సేకరించినట్టు సమాచారం. అరెస్టు అనంతరం దొంతు రమేశ్‌ మీడియాతో మాట్లాడారు. విచారణలో పోలీసులకు అనుకూలమైన ప్రశ్నలు అడిగి రిమాండ్‌ రిపోర్టు రాసుకున్నట్టు తెలిపారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ఇక.. తనకు సంబంధం లేని కేసులో తనను ఇరికించారని, తనను ఎందుకు అరెస్ట్‌ చేశారో కూడా అర్థం కావట్లేదని రిపోర్టర్‌ సుధీర్‌ పేర్కొన్నారు. కాగా, డీజీపీ శివధర్‌ రెడ్డి ఈ అంశంపై స్పందించారు. చట్టపరిధికి లోబడి విమర్శలు, ఆరోపణలు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, పరిధి దాటి వ్యవహరిస్తే మాత్రం చట్టప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని.. అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Jan 15 , 2026 | 05:20 AM