కోరిక తీర్చకపోతే బదిలీ చేయిస్తా..!
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:29 AM
రాత్రికి నేను రమ్మన్న చోటుకు రాకపోతే బదిలీ చేయిస్తా.. అని బెదిరిస్తూ తన వద్ద పని చేస్తున్న మహిళలు, అమ్మాయిలను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న.....
మహిళా ఉద్యోగినులకు చర్లపల్లి రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ వేధింపులు
సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు మహిళల ఫిర్యాదు
అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆరోపణ
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రాత్రికి నేను రమ్మన్న చోటుకు రాకపోతే బదిలీ చేయిస్తా.. అని బెదిరిస్తూ తన వద్ద పని చేస్తున్న మహిళలు, అమ్మాయిలను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న ఓ రైల్వే అధికారిపై సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు అందింది. దక్షిణ మధ్య రైల్వే పరిధి చర్లపల్లిలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఎం.వెంకట సుబ్రహ్మణ్యంపై అతని వద్ద పని చేసే మహిళలు మంగళవారం ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ప్రకారం రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చర్లపల్లిలో సీనియర్‌సెక్షన్ ఇంజనీర్ అయిన వెంకట సుబ్రహ్మణ్యం కింద వివిధ విభాగాల్లో 20 మంది సిబ్బంది ఉన్నారు. ఈ సిబ్బందిలోని మహిళలు, అమ్మాయిలను సుబ్రహ్మణ్యం ఆరు నెలలుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. చెప్పిన పని చేయకపోతే బదిలీ చేయిస్తానని బెదిరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు. సుబ్రహ్మణ్యం వేధింపులు తాళలేక నెల రోజుల క్రితం ఓ మహిళ ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. అలాగే, చెప్పిన మాట వినలేదని సుబ్రహ్మణ్యం పది రోజుల క్రితం ఓ మహిళ ఉద్యోగినిని బోనగిరి రైల్వే స్టేషన్‌కు బదిలీ చేయించారు. ఇక, మహిళలకు అనవసరంగా పనులు చెప్పడం, చెప్పిన పని చేసినా నచ్చలేదని ఇష్టమొచ్చినట్టుగా సుబ్రహ్మణ్యం అసభ్యపదజాలంతో దూషిస్తుంటాడని సదరు మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వెంకట సుబ్రహ్మణ్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ప్రతినిధి సంగీత.. రైల్వే మహిళా ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు.