kumaram bheem asifabad- నారీ..సమరభేరి
ABN , Publish Date - Jan 21 , 2026 | 10:13 PM
రిజర్వేషన్లు కలిసి రావడంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడమే ఆలస్యం బరిలో నిలిచేందుకు ప్యూహరచన చేస్తున్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కలిసివచ్చాయి. జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి.
- జిల్లాలో రెండు మున్సిపాలిటీలు.. 50 వార్డులు
- కాగజ్‌నగర్ చైర్ పర్సన్ పదవి, 25 వార్డులు వారికే
- టికెట్ల వేటలో అశావాహులు
ఆసిఫాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రిజర్వేషన్లు కలిసి రావడంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడమే ఆలస్యం బరిలో నిలిచేందుకు ప్యూహరచన చేస్తున్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కలిసివచ్చాయి. జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకే కేటాయించారు. రెండు మున్సిపాలిటీల్లో 50 వార్డులు ఉన్నాయి. అందులో 25 వార్డులను మహిళలకే రిజర్వ్ చేశారు. ఇవి కాకుండా జనరల్ స్థానాల్లో సైతం పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పురపాలికల్లో రాజకీయం వేడెక్కింది. ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. నేడో రేపో ఎలక్షన్ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో ఆయా పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్య నేతలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరిని బరిలో దింపితే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు. చైర్ పర్సన్ అభ్యర్థులుగా ఎవరిని రంగంలోకి దింపాలి..ఏయే వార్డల్లో ఎవరిని నిలపాలనే దానిపై చర్చిస్తున్నారు.
- 2011 జనాభా లెక్కల ప్రకారం..
మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయించారు. జిల్లాలో రెండు మున్నిపాలిటీలు... 50 వార్డులు ఉన్నాయిజ ఆసిఫాబాద్‌లో 20 వార్డులు, కాగజ్‌నగర్‌లో 30 వార్డులు ఉన్నాయి. ఎస్టీ సామాజిక వర్గానికి 3, ఎస్సీకి 8 , బీసిలకు 14, జనరల్ మహిళలకు 15, జనరల్ స్థానాలకు 10 వార్డలను కేటాయించారు.ఇందులో మహిళలకు మొత్తం 25 వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా ఇందులో 5,7,8,12,13,14,16,18,19,20 వార్డులను మహిళలకే కేటాయించారు. కాగజ్‌నగర్‌లో మొత్తం 30 వార్డులు ఉండగా అందులో 1,3,4,6,7,9,12,13,14,18,19,20,21,23,27 వార్డులను మహిళలకు కేటాయించారు. ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మెన్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించగా కాగజ్‌నగర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవి బీసి మహిళకు కేటాయించారు.
- పతుల స్థానంలో సతులు..
జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో రాజకీయ కోలాహలం ప్రారంభమైంది ఆశావాహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయని భావించిన పలువురికి నిరాశ తప్పలేదు. అలాంటి చోట తమ స్థానంలో భార్యలేక కుటుంబంలోని మహిళలను బరిలో ఉంచాలని భావిస్తున్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి తోలిసారిగా ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల బరిలో ఉండేందుకు చాలా మంది ఉత్సహం చూపుతున్నారు. దీంతో అశావాహులు టికేట్ల కోసం ప్రధాన పార్టీల నాయకుల వద్దకు క్యూ కడుతున్నారు.
- అన్ని పార్టీల నేతలు..
మున్సిపల్ వార్డులకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో అన్ని పార్టీల ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు, టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులతో అంతర్గత చర్చలు మొదలు పెట్టారు. వార్డుల వారిగా ఆర్థిక , సామాజిక వర్గం అంశాలతో పాటు పార్టీ పరంగా అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. అన్నిరకాలుగా బలమైన అభ్యర్థులను పోటీలో దించాలనే కృతనిశ్చయంతో ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. రోజురోజుకు టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. తమకు కావాలంటే తమకు టికెట్ కావాలని అశావాహులు పోటీ పడుతున్నారు.