Share News

ఏం కష్టమొచ్చిందో

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:27 AM

భర్తకు దుబాయ్‌లో ఉద్యోగం.. ఆమెకు రూ.లక్షకు పైగా జీతంతో ఐటీ ఉద్యో గం.. బంగారంలాంటి ఇద్దరు పిల్లలు ప్రముఖ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నారు..

ఏం కష్టమొచ్చిందో

  • కొడుకు, కూతురుతో కలిసి మహిళా టెకీ ఆత్మహత్య

  • బిడ్డలను హత్తుకొని గూడ్స్‌ రైలు కింద పడిన తల్లి

  • చర్లపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద దారుణం.. ఆమె టీం లీడర్‌

  • భర్త దుబాయిలో ఉద్యోగం.. కూతురు, కొడుకు ఇంటర్‌

  • తమ చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్‌ నోట్‌

హైదరాబాద్‌ సిటీ/సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌/బీబీనగర్‌/కుషాయిగూడ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): భర్తకు దుబాయ్‌లో ఉద్యోగం.. ఆమెకు రూ.లక్షకు పైగా జీతంతో ఐటీ ఉద్యో గం.. బంగారంలాంటి ఇద్దరు పిల్లలు ప్రముఖ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నారు.. ఆర్థికంగా ఇబ్బందులు లేవు.. కానీ, ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో.. తన ఇద్దరు పిల్లలను గుండెలకు హత్తుకొని గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చర్లపల్లి రైల్వేస్టేషన్‌ పరిధిలో శనివారం తెల్లవారుజామున జరిగింది. సికింద్రాబాద్‌ రైల్వే డీఎస్పీ జావేద్‌, సికింద్రాబాద్‌ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌ల వివరాల ప్రకారం.. బోడుప్పల్‌ పరిధిలోని చెంగిచెర్ల హరితవనం లో ఉంటున్న పెనాటి విజయారెడ్డి(38) గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త సురేందర్‌రెడ్డి దుబాయిలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. వారికి కూతురు చేతనరెడ్డి (18), కుమారుడు విశాల్‌రెడ్డి (17) ఉన్నారు. ఘట్‌కేసర్‌లోని నారాయణ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ చేతనరెడ్డి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, విశాల్‌రెడ్డి (17) మొదటి సంవత్సరం చదువుతున్నారు. చెంగిచెర్లలోని ఇంట్లో విజయారెడ్డి తల్లితో ఉంటోంది. వీరి స్వగ్రా మం భువనగిరి మండలం బొల్లపల్లిఅని తెలిసింది.


శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో తనకు మీటింగ్‌ ఉందని తల్లితో చెప్పి విజయారెడ్డి ఇంటి నుంచి కారులో ఘట్‌కేసర్‌లోని హాస్టల్‌కు వెళ్లి.. తన కొడుకు, కూతురును వెంటతీసుకెళ్లింది. రాత్రి 11.30 గంటలకు వీరు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకొని, స్టేషన్‌ ఆవరణలో కారును నిలిపి లోపలికి వెళ్లారు. చర్లపల్లి- ఘట్‌కేసర్‌ వైపు ప్లాట్‌ఫాం దాటి 3.5కి.మీ. దూరం నడుస్తూ వెళ్లారు. అర్ధరాత్రి 1:00 గంటలకు విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలను గుండెలకు హత్తుకుని అటుగా వస్తున్న గూడ్స్‌ రైలుకు అడ్డం గా పట్టాలపై నిలబడింది. వారిని గమనించి న లోకోపైలట్‌ పదేపదే హారన్‌ కొట్టినా వారు పక్కకు వెళ్లలేదు. దీంతో రైలు వారిని ఢీ కొడు తూ వెళ్లిపోవటంతో ముగ్గురూ ప్రాణాలొదిలారు. పట్టాలపై మృతదేహాలు ఛిద్రమైన స్థితిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. మృతదేహాలు కనిపించాయి. విశాల్‌రెడ్డి జేబులో కారు తాళంచెవి లభ్యం కావటం తో పార్కింగ్‌లో కారు (టీఎ్‌స08జేసీ5224) ఆధారంగా వివరాలు సేకరించారు. శనివారం ఉదయం విజయారెడ్డి తల్లితో పాటు తమ్ము డు చిరంజీవి ఘటనాస్థలానికి బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.


ఆత్మహత్యపై అనుమానాలు..

విజయారెడ్డి ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా, ఓ వ్యక్తి నుంచి ‘సారీ మేడం మరోసారి తప్పు చేయను’ అనే మేసేజ్‌ కనిపించింది. దీంతో ఆమెకు ఆఫీ్‌సలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. భర్త సురేందర్‌రెడ్డి.. హైదరాబాద్‌కు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. విజయారెడ్డికి మెసేజ్‌ పంపిన వ్యక్తికి పోలీసులు ఫోన్‌ చేయగా.. ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఉంది. ఆ వ్యక్తిని కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు.

కారు పార్కింగ్‌ స్లిప్‌ వెనక సూసైడ్‌ నోట్‌..

విజయారెడ్డి కారు పార్కు చేసిన తర్వా త చర్లపల్లి రైల్వే టర్మినల్‌లో గంటపాటు పిల్లలలో గడిపినట్లు తెలుస్తోంది. రాత్రి 11.47 గంటలకు 9వ నంబరు ప్లాట్‌ఫాంపై ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కెమెరాలో కనిపించాయి. కారులో లభించిన పార్కింగ్‌ స్లిప్‌ వెనుక విజయారెడ్డి రాసిన సూసైడ్‌ నోట్‌ కనిపించింది. అందులో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. జీవితం భారంగా ఉంది.. ఇష్టంలేని జీవితం గడపాలని లేదు’ అని రాసి ఉన్నట్లు తెలిసింది. శనివారమే విజయారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి పుట్టినరోజు. తెల్లవారితే తనకు భార్య, పిల్లలు శుభాకాంక్షలు చెబుతారని ఆశించిన సురేందర్‌రెడ్డి.. వారు ఇక లేరన్న వార్తను వినాల్సి వచ్చింది. భార్యాపిల్లలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి ఆయన గుండెలవిసేలా విలపించినట్లు తెలిసింది.

Updated Date - Feb 01 , 2026 | 08:07 AM