Share News

పెట్రోల్‌ పోసి.. నిప్పంటించి.. ప్రియుడి భార్య, కుమారుడి హత్య

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:32 AM

వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని ప్రియుడి భార్య, 6 నెలల కుమారుడిపై ఓ మహిళ పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. ఆ తల్లి ఆర్తనాదాలు చేస్తూ ఒడిలో బిడ్డతో సహా మంటల్లో కాలిపోయింది.

పెట్రోల్‌ పోసి.. నిప్పంటించి.. ప్రియుడి భార్య, కుమారుడి హత్య

  • వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని

  • ఓ మహిళ ఘాతుకం.. నల్లగొండ జిల్లాలో ఘటన

మర్రిగూడ, జనవరి 31(ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని ప్రియుడి భార్య, 6 నెలల కుమారుడిపై ఓ మహిళ పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. ఆ తల్లి ఆర్తనాదాలు చేస్తూ ఒడిలో బిడ్డతో సహా మంటల్లో కాలిపోయింది. ఆమె అక్కడికక్కడే చనిపోగా.. ఆ పసికందు ఆస్పత్రిలో ప్రాణాలొదిలాడు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో శనివారం జరిగింది. కేతేపల్లికి చెందిన కుందేలు నగే్‌షకు మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన మమతతో (25) ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు మూడున్నర సంవత్సరాల అరుణ్‌నందన్‌, తరుణ్‌ నందన్‌ (6 నెలలు) ఉన్నారు. నగేష్‌ కేతేపల్లిలోనే ఉంటూ వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో కేతేపల్లికే చెందిన సుజాతతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. సుజాత భర్త ఆరేళ్ల క్రితం మృతిచెందగా, ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నగే్‌షకు పెళ్లి కాకముందు నుంచే ఆమెతో వివాహేతర సంబంధం ఉంది. నగే్‌షకు పెళ్లైన తర్వాత నుంచి అతనికి, సుజాతకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న మమతను అంతమొందించాలని సుజాత నిర్ణయించుకుంది. శనివారం నగేష్‌ పని నిమిత్తం పెద్ద కుమారుడితో కలిసి బయటికి వెళ్లాడు. నగేష్‌లేడని నిర్ధారించుకున్న సుజాత మధ్యాహ్నం కారం, కోళ్లను కోసే కత్తితో పాటు పెట్రోల్‌ తీసుకొని అతని ఇంటికి వెళ్లింది.


మమత తన చిన్న కుమారుడు తరుణ్‌నందన్‌తో ఇంట్లో ఉండగా, ఆమెపై సుజాత పెట్రోల్‌ పోసి నిప్పటించింది. మంటలను తాళలేక మమత పెద్దఎత్తున కేకలు వేస్తూ వీధిలోకి పరిగెత్తింది. స్థానికులు మంటలు ఆర్పివేయగా.. అప్పటికే మమత మృతిచెందింది. తరుణ్‌ నందన్‌కు 80శాతం గాయాలయ్యాయి. ఆ పసికందును స్థానికులు వెంటనే నాంపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల సూచన మేరకు నల్లగొం డ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మమతపై పెట్రోల్‌ పోసిన అనంతరం సుజాత నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. మృతురాలు మమత తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు.

Updated Date - Feb 01 , 2026 | 06:32 AM