Share News

ఫేస్‌బుక్‌లో పరిచయంతో..

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:15 AM

సోషల్‌మీడియాలో పరిచయం అయిన ఓ కిలేడీ మాటలు నమ్మి.. గోల్డ్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టిన ఓ వృద్ధుడు ఏకంగా రూ. 2.65కోట్లు పోగొట్టుకున్నాడు.

ఫేస్‌బుక్‌లో పరిచయంతో..

  • వృద్ధుడి నుంచి 2.65 కోట్లు కొల్లగొట్టిన కి‘లేడీ’

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): సోషల్‌మీడియాలో పరిచయం అయిన ఓ కిలేడీ మాటలు నమ్మి.. గోల్డ్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టిన ఓ వృద్ధుడు ఏకంగా రూ. 2.65కోట్లు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్‌ సోమాజిగూడ కు చెందిన 69 ఏళ్ల వృద్ధునికి ఫేస్‌బుక్‌లో రమ్యకృష్ణ అనే పేరుతో మహిళ పరిచయం అయింది. కొన్నాళ్ల పాటు స్నేహాన్ని నటించి బాధితుడి నమ్మకాన్ని చూరగొన్న ఆమె.. గోల్డ్‌ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదించానని నమ్మబలికింది. కేరళ, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో రిసార్టులు, వస్త్ర వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు బురిడీ కొట్టించి.. రూ. 50లక్షల పెట్టుబడి పెడితే కోట్లలో లాభాలు వస్తాయంటూ వృద్ధుడిని బుట్టలో వేసుకుంది. ఆమె మాటలు నమ్మిన బాధితుడు తొలుత చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టగా మంచి లాభాలను అందించింది. ఆ తర్వాత దశలవారీగా పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టించి.. కోట్లలో లాభాలు వచ్చాయంటూ ఓ నకిలీ వెబ్‌సైట్‌ చూపించింది. అయితే లాభాలను విత్‌డ్రా చేసుకునేందుకు 15 శాతం కమీషన్‌ చెల్లించాలని వృద్ధుడికి సందేశం వచ్చింది. బాధితుడు నిరాకరించి.. సదరు మహిళకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా స్విచాఫ్‌ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించి సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.

Updated Date - Feb 28 , 2026 | 04:15 AM