Share News

బడికి భూమి దానమిచ్చి.. దయనీయస్థితికి చేరుకొని!

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:34 AM

చాలా ఏళ్లక్రితం ఊర్లోని బడి కోసం ఆమె భర్త పెద్ద మనసు చేసుకొని కొంత స్థలాన్ని విరాళంగా ఇస్తే.. ఇప్పుడేమో పూటగడవని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆయన భార్య, తనకు నిలువనీడ లేదని..

బడికి భూమి దానమిచ్చి.. దయనీయస్థితికి చేరుకొని!

  • 20 ఏళ్ల క్రితం 400 గజాల స్థలం ఇచ్చిన కుటుంబం

  • ఉంటున్న ఇల్లు శిథిలావస్థకు.. మరమ్మతులకూ పైసల్లేవు

  • నిలువ నీడ లేదు.. ఇల్లు కట్టివ్వండంటూ బడి గేటు వద్ద మహిళ నిరసన

  • జనగామ జిల్లా వావిలాలలో ఘటన

పాలకుర్తి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): చాలా ఏళ్లక్రితం ఊర్లోని బడి కోసం ఆమె భర్త పెద్ద మనసు చేసుకొని కొంత స్థలాన్ని విరాళంగా ఇస్తే.. ఇప్పుడేమో పూటగడవని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆయన భార్య, తనకు నిలువనీడ లేదని.. ఇల్లు ఇప్పించాలంటూ అదే బడి వద్ద నిరసన తెలిపింది. ఉపాధ్యాయులు, విద్యార్థులను బడిలోకి వెళ్లనీయకుండా స్కూల్‌ గేటుకు అడ్డంగా పడుకుంది. జనగామ జిల్లా, పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామంలో ఈ ఘటన స్థానికుల హృదయాలను కదిలించివేసింది. గ్రామానికి చెందిన దొంగరి శ్రీలత, ఉపేందర్‌ రావు దంపతులు ఇరవై ఏళ్ల క్రితం 400 గజాల స్థలాన్ని ఊర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఉపేందర్‌ రావు దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తెకు పెళ్లయింది. కుమారుడు హైదరాబాద్‌లో ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఉపేందర్‌రావు 15 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఊర్లో శ్రీలత ఉంటున్న ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా కనీస మరమ్మతులు చేయించుకునే స్థోమత లేకపోవడంతో ఆమె, బంధువుల ఇళ్లలో ఉంటూ భారంగా కాలం వెళ్లదీస్తోంది. ఊర్లో గత ప్రభుత్వం కట్టించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో ఒకటి తనకు కేటాయించాలంటూ అధికారులను ఎన్నోసార్లు కలిసి వేడుకున్నా ఫలితం లేకపోయిందని శ్రీలత ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో తాము భూమి విరాళంగా ఇచ్చిన పాఠశాల వద్ద బుధవారం ఆమె నిరసన తెలిపింది. పాఠశాల గేటుకు తాళం వేసింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు గంటపాటు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. విషయాన్ని మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా చూస్తామని ఎంఈవో పోతుగంటి నర్సయ్య, పాఠశాల హెచ్‌ఎం తండ మల్లయ్య హామీ ఇవ్వడంతో శ్రీలత నిరసన విరమించింది.

Updated Date - Apr 02 , 2026 | 03:34 AM