పెళ్లి చేసుకుంటానని ఒకరు.. అనుమానంతో మరొకరు
ABN , Publish Date - Jan 31 , 2026 | 03:55 AM
పెళ్లి చేసుకుంటానని ఒకరు, అనుమానంతో మరొకరు వేధించడంతో వరంగల్ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది.
వేధింపులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
వరంగల్ జిల్లాలో ఘటన, ఆరుగురిపై కేసు నమోదు
పర్వతగిరి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): పెళ్లి చేసుకుంటానని ఒకరు, అనుమానంతో మరొకరు వేధించడంతో వరంగల్ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది. పర్వతగిరి మండలంలోని సీత్యాతండాకు చెందిన రమావత్ అనిత (26) వరంగల్ కమిషనరేట్‌లోని ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెతో వైజాగ్‌లో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కొమ్మనపల్లి తండాకు చెందిన గుగులోత్ రాజేందర్ పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో కొన్నేళ్లుగా వేధించడం మొదలు పెట్టాడు. ఆమె డ్యూటీలో ఉండగా వీడియో కాల్స్ చేయాలంటూ ఒత్తిడి చేసే వాడని, వేరే ఎవరితోనూ మాట్లాడొద్దని షరతులు పెట్టేవాడని సమాచారం. రాజేందర్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో అతనితో వివాహానికి నిరాకరించిన అనిత తల్లిదండ్రులు.. జవహర్‌లాల్ అనే మరోవ్యక్తితో అనితకు పెళ్లి కుదిర్చారు. తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందనే కోపంతో రాజేందర్.. జవహర్‌లాల్‌కు అనితపై లేనిపోనివి కల్పించి చెప్పి రెచ్చగొట్టాడు. వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలను కూడా వాట్సా్‌్‌పలో పంపించాడు. దీంతో జవహర్‌లాల్ సైతం అనితను వేధించడం ప్రారంభించాడు. ఇద్దరి వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన అనిత.. రాజేందర్‌కు ఫోన్ చేసి తమ ఇద్దరి మూలంగానే తన జీవితం నాశనమైందని, ఇక చావే తనకు దిక్కని కన్నీరు పెట్టింది. దిక్కున్న చోట చెప్పుకోమని, చస్తే చావని రాజేందర్ చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 27న పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 29న మృతి చెందింది. పరిస్థితులు విషమిస్తుండడంతో పోలీసులు ముందుగానే అనితతో మరణ వాంగ్మూలం తీసుకున్నారు. అనిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీసులు రాజేందర్, జవహర్‌లాల్‌తో పాటు రాజేందర్ కుటుంబ సభ్యులైన గుగులోత్ వెంకన్న, కమిలి, ప్రవీణ్, జ్యోతిలపై కేసు నమోదు చేశారు. అనిత అంత్యక్రియలు స్వగ్రామమైన సీత్యాతండాలో శుక్రవారం పూర్తయ్యాయి.