Share News

Wings India Air: 28 నుంచి బేగంపేటలో వింగ్స్‌ ఇండియా ఎయిర్‌ షో

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:36 AM

ఆసియాలోనే అతిపెద్దదైన ‘వింగ్స్‌ ఇండియా ఎయిర్‌షో’కు మరోమారు హైదరాబాద్‌ వేదిక కాబోతుంది.

Wings India Air: 28 నుంచి బేగంపేటలో వింగ్స్‌ ఇండియా ఎయిర్‌ షో

  • నాలుగు రోజుల పాటు వ్యాపార సదస్సులు, ప్రదర్శనలు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఆసియాలోనే అతిపెద్దదైన ‘వింగ్స్‌ ఇండియా ఎయిర్‌షో’కు మరోమారు హైదరాబాద్‌ వేదిక కాబోతుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఈ అంతర్జాతీయ ప్రదర్శన, సదస్సులు జరగనున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘భారతీయ విమానయానం’ అనే ఇతివృత్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. డిజైన్‌ నుంచి విస్తరణ, తయారీ నుంచి నిర్వహణ, సమ్మిళితత్త్వం నుంచి ఆవిష్కరణ, భద్రత నుంచి స్థిరత్వం అనే అంశాలపై ఈ కార్యక్రమం సాగనున్నట్లు వెల్లడించింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఈ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 20కి పైగా దేశాల నుంచి నిపుణులు, పౌర విమానయాన సంస్థల ఉన్నతాధికారులు, మంత్రులతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల ప్రతినిఽధులు పాల్గొంటారని, తమ ప్రాంతాల్లో పెట్టుబడి అవకాశాలు, మౌలిక సదుపాయాల గురించి వివరించనున్నారని సమాచారం. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తొలిరోజున గ్లోబల్‌ సీఈఓ ఫోరమ్‌ జరుగనుంది. అనంతరం పలు అంశాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, ప్యానెల్‌ చర్చా కార్యక్రమాలు ఉండనున్నాయి. విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ, ఎయిర్‌క్రాఫ్ట్‌ లీజింగ్‌, ఫైనాన్సింగ్‌, హెలికాఫ్టర్ల నిర్వహణ సామర్థ్యానికి సంబంధించి నూతన అవకాశాల అన్వేషణ తదితర అంశాలపై చర్చలు జరుగనున్నాయి. ఈ సదస్సులో భాగంగానే ఎయిర్‌ కార్గో రవాణా, బిజినెస్‌ ఏవియేషన్‌, విమాన విడి భాగాల తయారీ రంగంలో ఉన్న అవకాశాలు, పర్యావరణ అనుకూల విమానయాన రంగం వంటి అంశాలపై చర్చించనున్నారు.

Updated Date - Jan 20 , 2026 | 02:36 AM