Share News

‘యువ వికాసం’ అందేనా..?

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:33 AM

యువత స్వయం ఉపాధికి బాటలు వేసే యువవికాసం పథకం దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో అర్హులను గుర్తించి ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నవంబరులో రాజీవ్‌ యువవికాసం కింద మొదటి విడతగా కొందరికి ప్రయోజనాన్ని

‘యువ వికాసం’ అందేనా..?

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

యువత స్వయం ఉపాధికి బాటలు వేసే యువవికాసం పథకం దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలో అర్హులను గుర్తించి ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నవంబరులో రాజీవ్‌ యువవికాసం కింద మొదటి విడతగా కొందరికి ప్రయోజనాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. మళ్లీ దరఖాస్తులను జిల్లాలో అధికారులు పరిశీలించనున్నారు. ఆయా సంక్షేమ శాఖల పరిధిలో మండలాలు, పట్టణాల వారీగా వచ్చిన దరఖాస్తుల్లో ఉన్న ధ్రువపత్రాలను సరిచూస్తారు. అందులో అర్హులెవరు.? అనర్హులెవరనే కోణంలో క్షుణ్ణంగా గమనిస్తూ అర్హుల ఎంపిక దిశగా కసరత్తును మొదలు పెడతారు. మరోవైపు జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత సర్కారు సాయాన్ని తొందరగా అందిస్తే ఏదో ఒక ఉపాధితో రాణించాలనే ఆశతో నిరీక్షిస్తున్నారు. పనిలో పనిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎప్పుడు అందిస్తారని అధికారుల్ని ఆరా తీస్తున్నారు.

ఫ 57,763 మంది దరఖాస్తు

ఏడేళ్ల తర్వాత రాష్ట్రంలో యువతకు స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి రుణాల్ని ఇవ్వాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది మార్చి 25న పథకం విధివిధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులను వెలువరించింది. నెలన్నర రోజులపాటు దరఖాస్తుకు గడువు ఇవ్వడంతో జిల్లాలోని నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మొదట ఇనకమ్‌, రేషనకార్డు తప్పక ఉండాలని చెప్పడంతో కొందరే ఆసక్తి చూపించారు. తర్వాత ఈ నిబంధనను సడలించడంతో పెద్దమొత్తంలో యువత ఆసక్తిని చూపించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 57,763 మంది ఆనలైనలో దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత ఆ దరఖాస్తు ఫారాలను ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపాలిటీ ఆఫీసుల్లో అందజేశారు. అత్యధికంగా ఎస్సీ కార్పొరేషనకు 15వేలకుపైగా దరఖాస్తు చేసుకున్నారు. బీసీ కార్పొరేషన, ఈబీసీ, మైనారిటీ కార్పొరేషనలకు కలిపి 35వేలపైచిలుకు అందాయి. ఎస్టీ కార్పొరేషనకు 1200కుపైగా అర్జీలొచ్చాయి. కరీంనగర్‌ కార్పొరేషన పరిధిలోనే 15వేల మంది ఆసక్తి చూపించారు. అప్పట్లోనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలను జరపాలి. కాని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో వాటి జోలికి వెళ్లలేదు. తాజాగా సర్కారు వీటిని పరిశీలించాలని చెప్పడంతో అధికారులు ఈదిశగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల వచ్చిన మార్గదర్శకాల ప్రకారం వీటిపై త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చూస్తేనే అర్హులకు లబ్ధి చేకూరుతుంది. పైరవీలకు ఆస్కారమిస్తే అర్హులకు అన్యాయం జరిగే వీలుంది. అందుకనే పారదర్శకంగా ప్రక్రియను కొనసాగించాలని అర్జీదారులు కోరుతున్నారు. గతంలో రుణాలు తీసుకున్న వారికి కాకుండా కొత్తవారికి అందించాలని విన్నవిస్తున్నారు.

Updated Date - Sep 24 , 2026 | 01:33 AM