Share News

kumaram bheem asifabad-కూలీలకు భరోసా ఇచ్చేనా?

ABN , Publish Date - Feb 11 , 2026 | 11:01 PM

ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌ (వీబీ జీ రామ్‌ జీ)గా పేరు మార్చింది. కొత్త నిబంధనలతో వస్తున్న వీబీ జీ రామ్‌ జీ ద్వారా ఏ మేరకు ఉపాధి లభిస్తుందనే ఆందోళనలు, అయోమయం నెలకొన్నది

kumaram bheem asifabad-కూలీలకు భరోసా ఇచ్చేనా?
లోగో

- మార్చి నెలాఖరు వరకు పాత విధానంలోనే కొనసాగింపు

- 100 నుంచి 125రోజులకు పని దినాల పెంపు

- జిల్లాలో 1.22లక్షల జాబ్‌కార్డులు

బెజ్జూరు, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌ (వీబీ జీ రామ్‌ జీ)గా పేరు మార్చింది. కొత్త నిబంధనలతో వస్తున్న వీబీ జీ రామ్‌ జీ ద్వారా ఏ మేరకు ఉపాధి లభిస్తుందనే ఆందోళనలు, అయోమయం నెలకొన్నది. జిల్లాలో ఈ పథకం ఏ విధంగా కూలీలకు ఉపయోగపడుతుందని చర్చ మొదలైంది. ఒకవైపు ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడంపై కాంగ్రెస్‌, ఇతర పార్టీల నిరసనలు కొనసాగుతున్న క్రమంలో ఉపాధి కూలీల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న గ్రామపంచాయతీలకు ఉపాధి హామీ పథకం పెద్ద భరోసాగా నిలిచింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పనులులేక వలసలను నివారించడంలో ప్రయోజనకరంగా మారింది. 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ప్రవేశపెట్టింది. కూలీల హాజరును బట్టి గ్రామాల్లో మెటీరియల్‌ కాంపోనెంట్‌తో సీసీ రోడ్లు, రహదారులు, అంగన్‌వాడీ భవనాలు, హెల్త్‌ క్లీనిక్‌లు, పంచాయతీ భవనాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఉపాధిహామీ పేరు మారడంతో పాటు నిబంధనలు కూడా మార్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏమేరకు పనులు కలుగుతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలన్న డిమాండ్‌ ఒకవైపు ఉండగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పుల వల్ల వ్యవసాయ అనుసంధానం నీరుగారి పోతుందనే చర్చ కూడా జరుగుతోంది.

ఫ నిధుల కేటాయింపు..

ఇప్పటివరకు ఉపాధిహామీ పథకానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు కేటాయిస్తోంది. కానీ వీబీ జీ రామ్‌జీ ద్వారా కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధుల్లో వాటా భరించాల్సి ఉంటుంది. రాష్ట్రప్రభుత్వానికి నిబంధన ఇబ్బందికరంగా మారుతుందని, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాటా చెల్లించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటు ఉపాఽధిహామీ పథకం జాబ్‌కార్డుల స్థానంలో గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారెంటీ కార్డును ఇవ్వనున్నారు. కార్డు కాలపరిమితి మూడేళ్లు మాత్రమే ఇస్తారు. ప్రత్యేక వర్గాలకు స్పెషల్‌ కార్డులు మంజూరు చేస్తారు. ప్లానింగ్‌ విధానంలో మార్పులతో రాష్ర్టాలకు లేబర్‌ బడ్జెట్‌ ఉండదు. కేంద్రం నుంచే నిధులు నిర్దేశిస్తారు. డిమాండ్‌ పెరిగితే అదనపు ఖర్చులను రాష్ర్టాలే భరించాల్సి ఉంటుంది. ఉపాధి పథకం నిర్వహణలో ఏదైనా లోపాలు జరిగితే గతంలో వెయ్యి రూపాయల జరిమానా విధించేవారు. కొత్త పథకం ద్వారా జరిమానా 10వేల రూపాయలకు పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులపై ఎలా స్పందిస్తుందనేది కూలీల్లో అయోమయంగానే ఉంది.

ఫ 2.39లక్షల కూలీలు..

జిల్లాలో 15మండలాల పరిధిలో 335 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో 1.22లక్షల జాబ్‌కార్డులు ఉండగా, 2.39లక్షల కూలీలు ఉన్నారు. క్రియాశీలక జాబ్‌కార్డులు 88వేలు ఉన్నాయి. ఇందులో 1.61లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు. ఉపాఽధి హామీ జాబ్‌కార్డులో నమోదైన కూలీలకు బదులుగా మరొకరు హాజరవుతున్నారని ఆరోపణల నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు ఆధార్‌ అనుసంధానం ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కాగా ఉపాధిహామీ పథకంలో కూలీలకు వంద రోజులు పని కల్పించాలనే లక్ష్యంగా ప్రస్తుతం ఉంది. వీబీ జీ రామ్‌ జీ ద్వారా కేంద్ర ప్రభుత్వం పని దినాల పరిమితిని 125రోజులకు పెంచింది. కూలీ 325 రూపాయలకు పెంచే ఆలోచనలో ఉంది. గతంలో ఏడాదిలో 60రోజుల విరామం వ్యవసాయ సీజన్‌ను బట్టి ఇస్తున్నారు. పని దినాలు పెంచాలని డిమాండ్‌ చాలాకాలంగా ఉన్న నేపథ్యంలో 125రోజులు చేయడం కూలీల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది. దీనికి అనుగుణంగా 2026-27లేబర్‌ బడ్జెట్‌లో కూడా మార్పులు తేవడానికి కసరత్తు చేస్తున్నారు.

ఫ నిర్మాణాత్మక పనులపై దృష్టి

గ్రామసభల ద్వారా గుర్తించి జియోట్యాగింగ్‌ చేసిన పనులకు సంబంధించిన ఫొటోలను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. జిల్లాలో గ్రామసభలు నిర్వహించేందుకు అఽధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. గతంలో మట్టి పనులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. ఈసారి శాశ్వత పనులపైనే దృష్టిపెడుతున్నారు. చెరువుల్లో పూడికతీత, కందకాలు తవ్వడం వంటి పనులకు బదులుగా నీటి సంరక్షణ, తాగునీటి వనరుల పనులు, గ్రామాల్లో మౌలిక వసతుల పనులు, సాగునీటి కాలువలు వంటి పనులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఫ నిధులు సద్వినియోగమయ్యేనా?

ఉపాధిహామీ పథకాన్ని కేంద్రం పేరు మార్పు చేయడంతో పాటు పథకాన్ని సమూల మార్పులు కూడా చేశారు. ఈ పథకంలో కోట్ల నిధులు అందుబాటులో ఉన్నా ఈసారి సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో నిధులను సద్వినియోగం చేసుకుంటారా అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. మరో రెండు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం గడువు ముగుస్తుండడంతో ఇప్పటికి పనులు ప్రారంభం కాలేదు. గడువులోగా పనులు చేపట్టి నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. నిధులున్నా సమయం లేకపోవడంతో నిధులు ఖర్చు అయ్యేలా కనిపించడం లేదు. కాగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చిన కొత్త పనుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు.

Updated Date - Feb 11 , 2026 | 11:01 PM