Share News

kumaram bheem asifabad- బస్తాండు విస్తరణ జరిగేనా..?

ABN , Publish Date - Mar 24 , 2026 | 10:41 PM

జిల్లా కేంద్రంలోని బస్టాండు పరిస్థితి దయనీయంగా మారింది. ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టి సారించడం లేదు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పడిన తరువాత జిల్లా కేంద్రానికి ప్రయాణికుల తాకిడి పెరిగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మహలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో బస్టాండులో రద్దీ పెరిగింది. కానీ ఆ మేరకు వసతులు మాత్రం కరువయ్యాయి

kumaram bheem asifabad- బస్తాండు విస్తరణ జరిగేనా..?
లోగో

ఆసిఫాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని బస్టాండు పరిస్థితి దయనీయంగా మారింది. ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టి సారించడం లేదు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పడిన తరువాత జిల్లా కేంద్రానికి ప్రయాణికుల తాకిడి పెరిగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మహలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో బస్టాండులో రద్దీ పెరిగింది. కానీ ఆ మేరకు వసతులు మాత్రం కరువయ్యాయి. జిల్లాలో ఉన్న ఏకైక బస్‌ డిపో ఆసిఫాబాద్‌. జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్‌ లో రద్దికి తగినంత సదుపాయాలు లేవు. ప్రజలు తమ వ్యక్తిగత అవసరాల కోసం జిల్లా కేంద్రాన్ని సందర్శిస్తుండడం,మండలాలు, గ్రామాలనుంచి జిల్లా కేంద్రానికి తరుచు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో బస్టాండ్‌లో రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. కానీ బస్టేషన్‌లో కేవలం ఐదు ప్లాట్‌ ఫాంలు మాత్రమే ఉండడంతో ప్రయాణికుల రద్దీ సమయాల్లో నీడ కల్పించలేని పరిస్థితి కొనసాగుతోంది. బస్టేషన్‌ విస్తరణ కోసం ఆర్టీసీ అధికారులు దృష్టి సారించక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

- 15 మండలాల నుంచి..

గతంలోఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు బెజ్జూరు, కౌటాల వంటి మారుమూల మండలాలకు చెందిన ప్రజలు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఆదిలాబాద్‌కు చేరేందుకు ఆసిఫాబాద్‌,మంచిర్యాల మీదుగా ఆదిలాబాద్‌కు వెళ్లె వారు. అయితే ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం కావడంతో ఆదిలాబాద్‌కు రద్దీ భారీగా పడిపోయినట్లు ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. అదే సమయంలో ఆసిఫాబాద్‌కు క్రమంగా రద్దీ పెరుగుతున్నందున డిపో ఆదాయం కూడా పెరిగింది. .జిల్లాగా మారిన తరువాత అన్ని మండలాల నుంచి ప్రజలు ప్రభుత్వ పరమైన కార్యకలాపాల కోసం జిల్లా కేంద్రానికి ప్రజలు తరలి వస్తున్నారని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా సోమ, శని వారాల్లో రద్దీ అధికంగా ఉన్నట్లు ఆర్టీసీ సిబ్బంది మాటలను బట్టి అర్థమవుతోంది. ఆసిఫాబాద్‌ డిపో నుంచి ప్రతి రోజు అన్ని రూట్లలలో 81 షెడ్యూళ్ళు 89 బస్సులను అయా పట్టణాలు,గ్రామాలు, శివారు గ్రామాలకు బస్సు సర్వీసులు నడుపుతోంది. సగటున ప్రతి రోజు 33,700 కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు సేవలు అందిస్తుండగా ఇందులో 30 వేల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రతీ రోజు డిపో కు రూ 20 లక్షల ఆదాయం సమకూరుతోంది.

కనీస వసతులు కరువు..

చిరంజీవి, ఆసిఫాబాద్‌

జిల్లా కేంద్రంగా ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచిన బస్టాండులో కనీస వసతులు మెరుగు పడలేదు. దూరప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. బస్టాండు విస్తరించి మౌలిక సదుపాయాలు కల్పించేం దుకు అధికారులు చర్యలు తీసుకుంటే ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోతాయి.

Updated Date - Mar 24 , 2026 | 10:41 PM