Share News

election expenses: ఎన్నికల ఖర్చులొచ్చేనా?

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:02 AM

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఖర్చుల బిల్లుల కోసం కార్యదర్శులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలరోజులు గడిచినా, చేసిన ఖర్చులకు లెక్కలు అడగకపోవడంపై కార్యదర్శుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

election expenses: ఎన్నికల ఖర్చులొచ్చేనా?

గ్రామపంచాయతీ కార్యదర్శుల్లో అంతర్మథనం

కలెక్టర్‌ దృష్టి సారించాలని విజ్ఞప్తి

జిల్లా వ్యాప్తంగా రూ.1.70 కోట్ల మేర వ్యయం చేసినట్లు లెక్కలు

నిధులు ఇప్పించాలని వేడుకుంటున్న కార్యదర్శులు

(ఆంరఽధజ్యోతిప్రతినిధి,నల్లగొండ): గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఖర్చుల బిల్లుల కోసం కార్యదర్శులు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలరోజులు గడిచినా, చేసిన ఖర్చులకు లెక్కలు అడగకపోవడంపై కార్యదర్శుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బిల్లులు వస్తా యో రావోనని, బిల్లులు చెల్లించాలని అడిగితే ఏమవుతుందోనని పలువురు కార్యదర్శులు అంతర్మథనం చెందుతున్నారు.

పంచాయతీలకు పాలకవర్గాలు లేని 22 నెలల కాలంలో అత్యవసర పనులకు వారు అప్పు తెచ్చిమరీ పనులు చేయించారు. ఆ బిల్లులు ఇంతవరకు రాలేదు. అయితే ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఖర్చులు సైతం చెల్లించకపోవడంతో అప్పుల భారం పెరిగి ఇబ్బందిపడుతున్నామని పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ బిల్లులపై కలెక్టర్‌ దృష్టిసారించి చెల్లింపులు చేయించాలని కోరుతున్నారు.

ఒక్కో పంచాయతీలో రూ.20వేల వరకు వ్యయం

గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ కోసం క్లస్టర్లను ఏర్పాటు చేశారు. నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేయగా, అక్కడ నామినేషన్ల స్వీకరణ మొదలు అభ్యర్థుల ప్రకటన వరకు ఏడు రోజుల పాటు ఏర్పాట్లు జరిగాయి. అక్కడ పనిచేసిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీసులతో సహా అందరికీ భోజనాలు, టిఫిన్లు, టీలతో పాటు ఇతర స్టేషనరీ ఖర్చులను ఆయా క్లస్టర్ల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులే వెచ్చించారు. ఆ తర్వాత పోలింగ్‌ సందర్భంగా ముందురోజు రాత్రి మొదలు పోలింగ్‌ ముగిసి బాక్సులు తిరిగి వెళ్లేంతవరకు పోలింగ్‌ సిబ్బంది, పోలింగ్‌ నిర్వహణకు సంబంధించిన స్థానిక ఖర్చులన్నీ కార్యదర్శులే చేశారు. చిన్న, పెద్ద పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు ఒక్కో గ్రామంలో కనీసం రూ.20వేల వరకు కార్యదర్శులు వెచ్చించారు. జిల్లాలో 844 గ్రామపంచాయతీలకు సుమారు రూ.1.70కోట్ల మేర ఆయా పంచాయతీల కార్యదర్శులు ఖర్చు చేసినట్టు సమాచారం.

నేటికీ అందని డబ్బులు

డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ సెంటర్ల నిర్వహణ, వాహనాలు, రూట్ల నిర్వహణ, ఇతర ఖర్చులన్నీ మండల స్థాయిల్లో ఎంపీడీవోలు భరించారు. ఎన్నికల ప్రక్రియ సందర్భంగా కొంత మేర నిధులు విడుదల కాగా, మండల స్థాయిల్లో డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ సెంటర్‌ నిర్వహణకు, మండలస్థాయిల్లో ఎన్నికల విధులు నిర్వహించిన వారికి, ఇతర ఖర్చులకు ఆ నిధులు వెచ్చించినట్లు చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు చేసిన ఖర్చులకు సైతం రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి నిధులు వస్తాయని, అందులో భాగంగా తాజాగా కొంతమేర నిధులు విడుదలయినప్పటికీ నల్లగొండ జిల్లాలో మాత్రం అవి రాలేదని పలువురు కార్యదర్శులు తెలిపారు. యాదాద్రి జిల్లాలో జనరల్‌ ఫండ్‌ నుంచి నిధులను కేటాయించగా, నల్లగొండ జిల్లాలో అలా ఖర్చుచేసేందుకు అనుమతి లేదని పేర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం మూడు మండలాల్లో మాత్రం ఒక్కో పంచాయతీకి, పంచాయతీ సామర్థ్యాన్ని బట్టి రూ.5వేల నుంచి రూ.8వేల వరకు విడుదల కాగా, మిగిలిన మండలాల్లో మాత్రం ఇవ్వలేదని తెలిసింది. ఇప్పటికే పంచాయతీల పాలకవర్గాలు లేని 22 నెలల కాలంలో చేసిన పనులకు సంబంధించి ఒక్కో పంచాయతీలో సుమారు రూ.5లక్షల నుంచి రూ.15లక్షల వరకు పెండింగ్‌ బిల్లులు పేరుకుపోయాయి. తాజాగా ఈ ఖర్చులు సైతం అదనపు భారమని కార్యదర్శులు వాపోతున్నారు. పంచాయతీలకు, ఎన్నికల నిర్వహణ నిమిత్తం చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను ఎంపీడీవోల ద్వారా ఆయా కార్యదర్శులకు నేరుగా అందించేలా కలెక్టర్‌ చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కొత్తగా ఏర్పాటైన పాలకవర్గాలు ఈ నిధులను ఏ ఫండ్‌ నుంచి కూడా ఇచ్చేందుకు అనుమతించడం లేదని, వాటిని ఇప్పించి ఆదుకోకపోతే ఆ భారం భరించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని, ఈ వ్యవహారంపై కలెక్టర్‌, జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించి చేసిన ఖర్చులకు బిల్లులు ఇప్పించాలని కార్యదర్శులు కోరుతున్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:03 AM