చేప పిల్లల పంపిణీ జరిగేనా?
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:19 AM
జిల్లాలో ఈ ఏడాది చేప పిల్లల పంపిణీపై మరోసారి అనిశ్చితి నెలకొన్నది. ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌తో పాటు పలు చెరువులు, కుంటలు నిండి జలకళను సంతరించుకున్నాయి. మరికొన్ని చెరువులు, కుంటల్లోకి కూడా 75 శాతానికి పైగా నీళ్లు రావడంతో మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో ఈ ఏడాది చేప పిల్లల పంపిణీపై మరోసారి అనిశ్చితి నెలకొన్నది. ఇటీవల కురిసిన వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌తో పాటు పలు చెరువులు, కుంటలు నిండి జలకళను సంతరించుకున్నాయి. మరికొన్ని చెరువులు, కుంటల్లోకి కూడా 75 శాతానికి పైగా నీళ్లు రావడంతో మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే గతంలో సరఫరా చేసిన చేప పిల్లలకు సంబంధించిన బిల్లులు ఇంకా పూర్తిగా చెల్లించకపోవడంతో టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారు. ముందుగా బకాయిలు చెల్లిస్తేనే టెండర్లు దాఖలు చేస్తామని స్పష్టం చేస్తుండటంతో చేప పిల్లల పంపిణీ సకాలంలో జరుగుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2024, అంతకంటే ముందు పంపిణీ చేసిన చేప పిల్లలకు సంబంధించి పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో గత టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. గతేడాది కంటే 15 రోజుల ముందే ప్రభుత్వం కావాల్సిన 116 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిం చడం, టెండర్ల ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామమే అయిన ప్పటికీ, కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి కనబడుతున్నది. ప్రభుత్వం బుధవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు టెండర్ దరఖాస్తుల స్వీక రణకు అవకాశం కల్పించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎంపికైన సంస్థల ద్వారా చేప పిల్లలను జిల్లాలోని నీటి వనరుల్లో వదిలేలా ప్రణాళిక రూపొందించారు. అయితే కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే చేప పిల్లల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫ రూ.1.58 కోట్ల చేప పిల్లల పంపిణీ లక్ష్యం..
జిల్లాలో గల చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. మొత్తం 1027 చెరువులు, కుంటలు ఉండగా, ఇందులో 100 ఎకరాలకు పైబడిన చెరువులు 113 ఉండగా, 100 ఎకరాల లోపు చెరువులు, కుంటలు 914 ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో 25 నుంచి 50 శాతం వరకు నిండిన చెరువులు, కుంటలు 108 ఉండగా, 50 నుంచి 75 శాతం నిండినవి 247 ఉన్నాయి. 75 నుంచి 100 శాతం వరకు 449 ఉన్నాయి. వంద శాతానికి మించి మత్తడులు దూకిన చెరువులు, కుంటలు 231 ఉన్నాయని జిల్లా నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు. వీటితో పాటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో మొత్తం ఒక కోటి 58 లక్షల చేప పిల్లలను మత్స్యకారులకు పంపిణీ చేసేందుకు జిల్లా మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 80 మిల్లీమీటర్ల పరిమాణం గల చేప పిల్లలు 56 లక్షలు, 40 మిల్లీమీటర్ల పరిమాణం గల చేప పిల్లలు ఒక కోటి 2 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది. వర్షాకాలంలో నీటి నిల్వలు పెరిగిన ఈ సమయంలో చేప పిల్లలను వదిలితే వేగంగా ఎదిగి మత్స్యకారులకు అధిక దిగుబడి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఫ నగదు ఇస్తే మేమే కొనుగోలు చేస్తాం..
యేటా ఉచిత చేప పిల్లల పంపిణీ ఆలస్యం అవుతుండడంతో ప్రభుత్వం నగదు బదిలీ చేస్తే తామే నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో వదులుతామని జిల్లాలోని మత్స్యకార సహకార సంఘాల సభ్యులు అంటున్నారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయం తగ్గడమే కాకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చేప పిల్లలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. టెండర్ల ప్రక్రియ ఆలస్యం అయితే చేప పిల్లల పంపిణీ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. దీనివల్ల చేపల పెరుగుదలపై ప్రభావం పడటంతోపాటు ఆదాయంపైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి టెండర్లను రద్దు చేసి నగదు పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.