మారుపేర్లు మారేనా..?
ABN , Publish Date - Jun 16 , 2026 | 11:14 PM
సింగరేణిలో మారు పేర్లపై విధులు నిర్వహి స్తున్న కార్మికులకు సొంత పేర్లు అమలు చేస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీతో సంబంధిత కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
-డిప్యూటీ సీఎం హామీతో చిగురిస్తున్న ఆశలు
-దశాబ్ధాలుగా సింగరేణి కార్మికుల ఎదురు చూపు
-హామీ అమలైతే వారసత్వ ఉద్యోగాలకూ లైన్ క్లియర్
-ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడ్డ వందలాది కుటుంబాలు
మంచిర్యాల, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో మారు పేర్లపై విధులు నిర్వహి స్తున్న కార్మికులకు సొంత పేర్లు అమలు చేస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీతో సంబంధిత కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పేరు మార్పిడిపై దశాబ్దాలు గా ఎదురు చూస్తున్నప్పటికీ ఆ అంశంపై ఏ ప్రభుత్వమూ సీరియస్‌గా స్పందించ కపోవడంతో కార్మికుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయా రైంది. సింగరేణి కార్మికులకు మారు పేర్ల స్థానంలో సొంత పేర్లు అమలుకుచర్యలు చేపడతామని 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చారు. అ యితే దాదాపు ఏడేళ్లు గడుస్తున్నా హామీ నెరవేరలేదు. ఈ లోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ అంశం పూర్తిగా మరుగున పడ్డట్లయింది. పేర్ల మార్పిడి విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయనే నెపథంలో ఆ ప్రక్రియను అంతటితోనే నిలిపివేశా రు. సింగరేణి వ్యాప్తంగా మారు పేర్లతో విధులు నిర్వహిస్తున్న వారు సుమారు 600 మంది వరకు ఉంటారని సమాచారం. వీరంతా అలియాస్ పేర్లతో విధుల్లో చేరినప్పటి నుంచి సొంత పేర్లకు నోచుకోవడం లేదు.
నిరక్ష్యరాస్యులు కావడంతో...
సుమారు 40 ఏళ్ల క్రితం ఉద్యోగాల్లో చేరిన వారు ఏ పేరుతో విధులు నిర్వహి స్తున్నారో కూడా తెలియని రోజులవి. దానికి తోడు అప్పట్లో అధిక శాతం మంది నిర క్షరాస్యులు సింగరేణి ఉద్యోగాల్లో చేరారు. ఎలాంటి విద్యార్హతలు లేకుండా బరువులు ఎత్తడం, పరుగు పందెంలో పాల్గొని విజయం సాధించిన వారికి సంస్థ నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సరైన ధృవీకరణ పత్రాలు లేని ఆ రోజుల్లో ఉద్యోగంలో చేరే సమయంలో కార్మికులు చెప్పిన పేర్లనే సింగరేణి అధికారులు నమోదు చేసుకున్నారు. అప్పట్లో గ్రామాల్లో ఇంటి పేరుతో పాటు వారు పని చేసే కుల వృత్తుల పేర్లతో కూడా సంభోధనలు ఉండేవి. అలా కులవృత్తుల పేరుతో పిలవబడే వారు ఉద్యోగంలో చేరిన తరువాత గనులపై ఆ పేరే కార్మికుల పేరుగా స్థిరపడింది. అప్పట్లో ఇంటిపేర్లపై పె ద్దగా పట్టింపులు లేకపోవడం, పైగా నిరక్షరాస్యులు కావడంతో తమ పేర్ల గురించి కా ర్మికులు ఏనాడూ రికార్డుల్లో పరిశీలన చేసుకోలేదు. సొంత పేర్లు రికార్డుల్లో ఎక్కిం చుకోవాలన్న ఆలోచన కూడా కార్మికులకు రాలేదు. దీంతో దశాబ్దాల తరబడి మారు పేర్లతోనే ఉద్యోగాలు చేస్తున్నారు.
డిపెండెంట్ ఉద్యోగాలపై ప్రభావం...
మారు పేర్లతో ఉద్యోగాలు చేస్తున్న కార్మికుల పిల్లలపై దాని ప్రభావం అధికంగానే పడుతోంది. అప్పటి కార్మికుల పిల్లల్లో ఉన్నత చదువులు చదివిన వారు ప్రస్తుతం అనేక మంది ఉన్నారు. వారి సర్టిఫికేట్లన్నీ సొంత పేర్లతోనే ఉన్నాయి. తండ్రి ఇంటి పేరులో దొర్లిన తప్పుల కారణంగా పిల్లల చదువుల్లోనూ దాని ప్రభావం పడింది. అలాగే సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడంతో మారు పే ర్లతో ఉన్న కార్మికుల పిల్లలు కొలువులో చేరేందుకు కూడా అడ్డంకిగా మారాయి. అనా రోగ్య కారణాలతో కార్మికులు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన సందర్భంలో తన తండ్రి ఇంటి పేరులో అక్షర దోషం ఉందనే సాకుతో పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరే ణి అధికారులు నిరాకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి కేసులు కొత్తగూ డెం కార్పొరేట్ విజిలెన్స్ విభాగం కార్యాలయంలో 600కు పైగా పెండింగులో ఉన్నాయి. ఈ విషయమై గతంలో పలు మార్లు కార్మిక కుటుంబాలు అప్పటి ముఖ్యమంత్రి తో పాటు సంస్థ సీఎండీ ధృష్టికి తీసుకెళ్లినా సమస్యకు పరిష్కారం లభించలేదు.
డిప్యూటీ సీఎం హామీతో చిగురిస్తున్న ఆశలు...
దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందోనని వందలాది కార్మిక కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల జిల్లా లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి కార్మికుల మారు పే ర్లపై ప్రకటన చేయడంతో వారి కుటుంబాల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. సింగరే ణిలో కారుణ్య నియామకాలకు ఎంపికైన 335 మందికి ఈ నెల 13న జిల్లా కేంధ్రంలో డిప్యూటీ సీఎం భట్టి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలోని ఏడు జిల్లాల నుంచి లబ్దిదారులు హాజరై నియామక పత్రాలు అందు కున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మారు పేర్లతో విధులు నిర్వ హిస్తున్న సింగరేణి కార్మికులకు సొంత పేర్లు అమలు చేస్తామని ప్రకటించారు. ఇందు కోసం సింగరేణి అఽధికారులు, యూనియన్ నాయకులతో ప్రత్యేకంగా కమిటీ వేయను న్నట్లు తెలిపారు. కమిటీ వేసిన అనంతరం మారు పేర్ల స్థానంలో సొంత పేర్లు మార్పు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం ప్రక టనతో కోల్‌బెల్ట్ వ్యాప్తంగా సంబంధిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దశా బ్దాల కాలంగా పెండింగులో ఉన్న జఠిలమైన సమస్యకు పరిష్కారం లభించ నుండటంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యూనియన్లూ చొరవ తీసుకోవాలి....
రెండున్నరేళ్ల కిత్రం జరిగిన సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. ప్రాతినిథ్య సంఘంగా ఎన్నికైన ఏఐటీయూసీ కార్మికుల పక్షాన నిలిచి సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలనే విజ్ఞప్తులు సర్వత్రా వినిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ కూడా డిప్యూటీ సీఎం ప్రకటన పట్ల బాధ్యతతో వ్యవహరించాలని కార్మికులు కోరుతున్నారు. పైగా మారు పేర్ల విషయమై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేస్తున్న స మయంలో గుర్తింపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ వైదికపై ఉం డటంతో వారిద్దరిపైనే కార్మికుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. పైగా త్వరలో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున పై రెండు సంఘాలకు డిప్యూ టీ సీఎం ప్రకటన అత్యంత ప్రధానంగా మారింది. హామీ మేరకు పేర్ల మార్పిడి జరిగితేనే ఐఎన్టీయూసీని కార్మికులు అక్కున చేర్చుకొనే అవకాశం ఉండగా, ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీకి డిప్యూటీ సీఎం ప్రకటన అందివచ్చిన అవకాశంగా ఉపయోగపడనుంది. హామీ నెరవేరని పక్షంలో ఎన్నికలకు ఏఐటీయూసీ అదే అస్త్రంగా వెళ్లేందుకు దోహదపడుతుంది. ఉప ముఖ్యమంత్రి హామీ మేరకు సింగరేణిలో మారు పేర్ల మార్పిడి జరిగితే వందలాది కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి.