Share News

ప్రాణహితకు ప్రాణం పోసేనా..?

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:29 PM

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను ఎత్తిపోయవచ్చని ముందు నుంచీ వాదిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అందుకు అనుగుణం గా ఆ ప్రాజెక్టును నిర్మించేందుకు అడుగులు వేస్తోంది.

ప్రాణహితకు ప్రాణం పోసేనా..?

152 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి ప్రభుత్వ సన్నా హాలు

మహారాష్ట్రతో సంప్రదింపులకు సర్కారు సుముఖత

చర్చల కోసం జల సంఘానికి సీఎం రేవంత్‌ వినతి

గతంలో 150 మీటర్లకూ అంగీకరించని మహారాష్ట్ర

చర్చలు సఫలమైతే ఉమ్మడి జిల్లా రైతాంగానికి మేలు

మంచిర్యాల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను ఎత్తిపోయవచ్చని ముందు నుంచీ వాదిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అందుకు అనుగుణం గా ఆ ప్రాజెక్టును నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రా ణహిత నదిపై బ్యారేజీ నిర్మించేందుకు సన్నాహాలు చే స్తోంది. ఈ నేపథ్యంలో తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు ని ర్మించడం ద్వారా ఉమ్మడి జిల్లాను సశ్యశ్యామలం చే యనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డితో సహా రాష్ట్ర మంత్రు లు పలువురు పలుమార్లు చెబుతూ వస్తున్నారు. ప్రా జెక్టు నిర్మాణానికి మహారాష్ట్రతో చర్చలు జరిపేందుకు కూడా రేవంత్‌ సర్కారు సిద్ధపడుతోంది. ఈ విషయమై ఇటీవల కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యుసీ) తో నూ సంప్రదింపులు జరిపారు. గతంలో తుమ్మిడి హెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ప్రతి పాదిం చగా... తాజాగా గ్రావిటీతో సుందిళ్ల బ్యారేజీకి నీటిని తరలించాలనే కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం తెరమీ దకి తెచ్చింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ప్రతిపాదిత ప్రాం తం నుంచి 71.5 కిలోమీటర్ల వరకు కాలువల నిర్మాణం కూడా గతంలోనే పూర్తయింది. ఇక బ్యారేజీ నిర్మాణమే తరువాయి అనే పరిస్థితిలో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం హఠాత్తుగా ప్రాజెక్టును రద్దు చేసింది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లు బ్యారేజీ నిర్మాణం జరిగితే తుమ్మిడిహెట్టి నుంచి నెన్నెల మండలం మైలా రం గ్రామం వరకు 71.5 కిలో మీటర్ల దూరం మోటార్ల వినియోగం లేకుండానే నీరు గ్రావిటీతో వచ్చే అవకా శాలు ఉన్నాయి. అక్కడ నుంచి తక్కువ సామర్థ్యం క లిగిన పంపుల ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలిం చవచ్చని గతంలో ప్రతిపాదించారు.

150 మీటర్ల ఎత్తుతో నిర్మాణం....!

ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో కట్టాలని ప్రతిపాదించగా....ముంపు అధికంగా ఉంటుందనే మహారాష్ట్ర అభ్యంతరాలతో పక్కన పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత 148 టీఎంసీ సామర్థ్యంతో ప్రాజెక్టును కడతామని అప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తో నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒప్పందం చేసుకు న్నారు. దీనికి మహారాష్ట్ర అంగీకారం తెలుపుతూ సంతకాలు చేసింది. కాళేశ్వరంతో పాటే తుమ్మిడి హెట్టిని కడతామని కేసీఆర్‌ ప్రకటించారు. తర్వాత తుమ్మిడిహెట్టి కాలగర్భంలో కలిసిపోయింది. వన్యప్రాణుల అభయారణ్యం, సాంకేతిక అంశాలు, నీటి లభ్యత లేదనే కారణాలతో ప్రాజెక్టును పక్కనబెట్టారు. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సర్వేలో తేల్చారు. గోదావరి, కృష్ణ, తదితర అన్ని నదుల్లో సహజంగా జూన్‌ నుంచి నవంబరు వరకే వరద ఉంటుంది. ప్రాణహితలో మాత్రం ఫిబ్రవరిలో కూడా 10 వేల క్యూసెక్కుల దాకా ప్రవాహం ఉంటుంది. దీంతో తుమ్మిడిహెట్టి వైపే కాంగ్రెస్‌ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. తాజాగా 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలనే నిర్ణయానికి కాంగ్రెస్‌ సర్కారు వచ్చింది. దీని కోసం త్వరలో మహారాష్ట్రకు వెళ్లనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడా ఇటీవల తెలిపారు. అయితే 152 మీటర్ల ఎత్తు కట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలపని పక్షంలో కనీసం 150 మీటర్ల ఎత్తువరకైనా ఒప్పించేలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో పట్టుదలతో ఉన్నందున అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఉమ్మడి జిల్లాలోని రైతులకు పుష్కలంగా సాగునీరందే అవకాశాలు అనేకం ఉన్నాయి.

సుందిళ్లను వినియోగించడం ద్వారా...

తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని పంపించవచ్చని ప్రభుత్వ యంత్రాంగం అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయంలోని సుందిళ్ల బ్యారేజీకి గ్రావిటీతో తరలించి, దాని పైననే ఉన్న ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయాలన్న తలంపుతో ప్రభుత్వం ఉంది. మైలారం గ్రామం వద్ద తవ్విన కాల్వలు, పైప్‌లైన్ల ద్వారా నీటిని సహజ సిద్దంగా ప్రవహించే జైపూర్‌లోని రసూల్‌పల్లె వాగులో కలపడం ద్వారా అక్కడి నుంచి గోదావరిలోకి గ్రావిటీ ద్వారా తరలించే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. గోదావరి నీటిని సుందిళ్ల బ్యారేజీకి తరలించి, అక్కడి నుంచి నేరుగా ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి తక్కువ ఖర్చుతో పంపింగ్‌ చేసే యోచనలో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానంలో కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయంలోని మిగతా బ్యారేజీలతో పనిలేకుండానే ఎగువకు నీరు తరలించే ప్రణాళికలు రూపొందించగా, మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ప్రాజెక్టు భవిష్యత్తు ఆధారపడి ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Oct 05 , 2026 | 11:29 PM