ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సీట్ల పెంపు
ABN , Publish Date - Apr 21 , 2026 | 04:50 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేకంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారా!? గత ఏడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో..
కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలన
మహిళా కోటా, డీలిమిటేషన్ బిల్లులు 2029లోపు మళ్లీ పార్లమెంటుకు రాకపోతేనే ఇందుకు అవకాశం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేకంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నారా!? గత ఏడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. 2026 తర్వాత నిర్వహించే జనగణన తర్వాతే ఇది ప్రారంభమవుతుందా!? ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలిస్తోందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అధికార వర్గాలు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం; డీలిమిటేషన్ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఈ దిశగా అడుగులు పడుతున్నాయని వివరించాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌లో డీలిమిటేషన్ వ్యవహారాలను సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. అయితే, డీలిమిటేషన్ బిల్లును ఆరు నెలల్లో మళ్లీ పార్లమెంటు ముందుకు తీసుకొస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. 2029 ఎన్నికల్లోపు ఆ బిల్లు మళ్లీ తెరపైకి రాని పక్షంలోనే ఏపీ, తెలంగాణల్లో ప్రత్యేక డీలిమిటేషన్‌కు అవకాశం ఉందని తెలిపాయి. ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే, దాని ప్రకారమే ముందుకు సాగే అవకాశం ఉందని వివరించాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014 ప్రకారం.. ఏపీ అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153కు పెరగాల్సి ఉంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఇచ్చిన హామీ కనక మహిళా కోటా; లోక్‌సభ సీట్ల పెంపుతో దీనికి సంబంధం లేదు. 2022 జూలై 27న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2026 తర్వాత ప్రచురించే తొలి జనగణన తర్వాతే డీలిమిటేషన్ జరిపి ఏపీ సీట్లను 225కు, తెలంగాణ సీట్లను 153కు పెంచుతామని తెలిపారు.
అయితే, జమ్ముకశ్మీర్ విభజన తర్వాత డీలిమిటేషన్ చేసినందువల్ల ఏపీ, తెలంగాణలో కూడా డీలిమిటేషన్ నిర్వహించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు గత ఏడాది జూలైలో తిరస్కరించిన విషయం తెలిసిందే. ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలను గుర్తు చేసింది కూడా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా మారిస్తే తప్ప రెండు రాష్ట్రాల్లో సీట్లను పెంచలేమని సుప్రీం కోర్టుతోపాటు కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణల్లో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉండాలనే విషయాన్ని పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 సూచిస్తోంది. రాష్ట్రాల జనాభాకు అనుగుణంగా వాటి అసెంబ్లీల్లో 60 నుంచి 500 సభ్యులు ఉండాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 నిర్దేశిస్తోంది. ఈ నేపథ్యంలో, వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా జనగణన పూర్తయి డీలిమిటేషన్‌ను నిర్వహించినా.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించకుండా ఆ చట్టంలో పేర్కొన్నట్లు అసెంబ్లీ సీట్లను మార్చడం కుదరదు. నిజానికి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించినట్లు అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచితే.. ఏపీకి 265, తెలంగాణకు 178 సీట్లు లభించే అవకాశాలున్నాయి. మహిళా కోటా బిల్లులో భాగంగా 50 శాతం సీట్లు పెంచినా; జనాభా ఆధారంగా డీలిమిటేషన్ బిల్లును ప్రవేశ పెట్టినా తెలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో పునర్వ్యవస్థీకరణ బిల్లు కంటే ఎక్కువగానే సీట్లు పెరిగే అవకాశాలున్నాయి. ఆ బిల్లును ఇప్పట్లో ప్రవేశపెట్టే అవకాశం లేకపోతే మాత్రం.. పునర్విభజన చట్టం ద్వారానే సీట్ల పెంపునకు అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.