ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెరిగేనా!
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:09 AM
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధ్యాపకులు విద్యార్థుల వద్దకు వెళుతూ అవగాహన కల్పిస్తూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేం దుకు అధ్యాపకులు నానా తంటాలు పడుతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధ్యాపకులు విద్యార్థుల వద్దకు వెళుతూ అవగాహన కల్పిస్తూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేం దుకు అధ్యాపకులు నానా తంటాలు పడుతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఉదయం పూట అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గత ఏడాది కంటే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధ్యాపకులు అంచనా వేస్తున్నారు. ఈ పథకాన్ని మొదట రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని 64ప్రభుత్వజూనియర్ కళాశాలల్లో అమలు చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం అమలు బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి సంబంధించిన రోజువారీగా మెనూ, ధరలు ఇంకా నిర్ణయించలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్ పదేళ్లుగా వినిపిస్తున్నది. అక్కడక్కడ పరీక్షలకు ముందు రెండునెలల నుంచి స్వచ్ఛంద సంస్థల ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. ఈ ఏడాది నుంచే కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల సంఖ్య గతంలో కంటే మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తున్నది.
- జిల్లాలో 14 జూనియర్ కళాశాలలు..
ఇంటర్‌మీడియెట్ బోర్డు ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 14ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి. గోదావరిఖనిలో బాలుర, బాలికలు, మంథనిలో బాలుర, బాలికలు, రామగుండంలో ఒకటి, సుల్తానాబాద్, జూలపల్లి, ధర్మారం, కమాన్‌పూర్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారంలో కళాశాలలు నడుస్తున్నాయి. ఈ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సుల్లో విద్యా బోధన చేస్తున్నారు. గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, ధర్మారం, రామగుండం, జూలపల్లి జూనియర్ కళాశాలల్లో వృత్తివిద్యా కోర్సులను కూడా బోధిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్నికళాశాలల్లో కొత్తగా ఏసీఈ(అకౌంట్స్, కామర్స్, ఎకానమిక్స్) కోర్సును ప్రవేశ పెడుతున్నారు. గతేడాది మొదటి సంవత్సరంలో 2,240 మంది విద్యార్థులు చేరగా, ద్వితీయ సంవత్సరంలో 2,134మంది చేరారు. 2025లో కంటే 2026లో 106మంది విద్యార్థులు అదనంగా చేరగా, ఈ విద్యాసంవత్సరం అంతకు మించి విద్యార్థుల సంఖ్య పెరగనున్నదని అధ్యాపకులు చెబుతున్నారు.
- అధ్యాపకుల ప్రచారం..
ప్రభుత్వ జూనియర్‌కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గాను ఎప్పటిలాగానే అధ్యాపకులు ఫ్లెక్సీ బ్యానర్లు, కరపత్రాలు ముద్రించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను గుర్తించి వారి ఇళ్ల వద్దకు వెళ్లి విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ కళాశాలల్లో చేరాలని చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నాం మఽధ్యాహ్నా భోజన పథకాన్ని అమలు చేస్తున్నారని, ప్రతి విద్యార్థికి ఒక కిట్ అందజేయనున్నారని, అందులో 12నోట్‌బుక్కులు, ఒక బ్యాగ్, గుర్తింపుకార్డు, రెండు జతల యూనిఫామ్స్, షూ, సాక్స్, బాలురకు ఒక బెల్ట్ ఇస్తున్నారని చెబుతున్నారు. అంతేగాకుండా అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ల్యాబ్ సౌకర్యం, ప్రభుత్వకళాశాలల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు ఎప్‌సెట్‌లో ర్యాంకు ఎంత వచ్చినా కూడా ఇంజినీరింగ్ కళాశాలల్లో పూర్తిస్థాయి ఫీజును రీయింబర్స్‌మెంట్ రూపంలో చెల్లిస్తుందని, ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు 10వేలలోపు ర్యాంకు వస్తేనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫీజు చెల్లిస్తుందని చెబుతున్నారు. అయితే అధ్యాపకులు చేస్తున్న ప్రచారం ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాల్సిందే.
- అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి.
- కల్పన, ఇంటర్ విద్య నోడల్ అధికారి
జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నారు. విద్యార్థులకు కిట్స్ కూడా అందించనున్నాం. ఈనెల ఒకటవ తేదీ నుంచి కళాశాలలు ప్రారంభం అయ్యాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీతో పాటు ఈ విద్యాసంవత్సరం ఏసీఈ కోర్సు ఆరంభం కానున్నది. మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. కళాశాలల్లో అన్ని మౌలికవసతులు ఉన్నాయి. తమ అధ్యాపకులు ఇంటింటికి వెళుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తు న్నారు. గతంలో కంటే ఈ విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరగనున్నది.