kumaram bheem asifabad- బస్ డిపో ఏర్పాటయ్యేనా..?
ABN , Publish Date - May 29 , 2026 | 10:40 PM
కాగజ్‌నగర్‌లో బస్ డిపో ఏర్పాటు హామీలకే పరిమి తమైంది. ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ దిశగా ఏ మాత్రం అడుగులు పడడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. సు మారు 25 ఏళ్ల క్రితం కాగజ్‌నగర్ బస్టాండు సమీపంలో ఐదు ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ స్థలం ఉన్నప్పటికీ బస్ డిపో మాత్రం ఇంకా మంజూరు కావడం లేదు. బస్ డిపో కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది.
- హామీలకే పరిమితమైందని ప్రజల ఆవేదన
కాగజ్‌నగర్, మే 29 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లో బస్ డిపో ఏర్పాటు హామీలకే పరిమి తమైంది. ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ దిశగా ఏ మాత్రం అడుగులు పడడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. సు మారు 25 ఏళ్ల క్రితం కాగజ్‌నగర్ బస్టాండు సమీపంలో ఐదు ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ స్థలం ఉన్నప్పటికీ బస్ డిపో మాత్రం ఇంకా మంజూరు కావడం లేదు. బస్ డిపో కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం కూడా సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో కాగజ్‌నగర్‌కు బస్ డిపో నిర్మించాలని, దీంతో తమ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని అసెంబ్లీలో ప్రస్తావించారు. కాని ఇంత వరకు అతీగతి లేని పరిస్థితి ఏర్పడింది.
- ఏడు మండలాల ప్రజలకు..
సిర్పూరు నియోజకవర్గంలోని ఏడు మం డలాల ప్రజలు నిత్యం కాగజ్‌నగర్‌కు వివిధ అవసరాల నిమిత్తం రాకపోకలు సాగిస్తారు. వీరంతా బస్సుల ద్వారా ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ డిపో బస్సుల ద్వారా ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. కాగజ్‌నగర్, సిర్పూరు(టి) వరకు రైలు మార్గం ఉన్నప్పటికీ కౌటాల, పెంచిక్‌పేట, చింతలమానేపల్లి, దహెగాం, బెజ్జూరు ప్రాంతాలకు కేవలం రోడ్డు మార్గం ద్వారానే రవాణా చేయాల్సి ఉంటుంది. కాగజ్‌నగర్-బెజ్జూరు, కాగజ్‌నగర్-దహెగాం నిత్యం రద్దీ ఉంటుంది. ఈ మార్గంలో బస్సులు నడుపుతున్నప్పటికీ రద్దీకి సరిపడా ఉండడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. కాగజ్‌నగర్‌లో బస్ డిపో ఏర్పాటు చేస్తే రద్దీ ఉన్న ప్రాంతాలను బట్టి నేరుగా కాగజ్‌నగర్ నుంచి బస్సులను నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం బస్సులన్నీ ఆసిఫాబాద్ నుంచి కాగజ్‌నగర్‌కు చేరుకొని మళ్లీ కాగజ్‌నగర్ మీదుగా వివిధ గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగజ్‌నగర్‌లో బస్సు డిపో ఏర్పాటు చేస్తే అన్ని సమస్యలు తీరుతాయని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ గ్రామాల నుంచి సకాలంలో బస్సులు రాక పోవడంతో ప్రత్యామ్నాయంగా ఆటోలు, జీపుల ద్వారా ప్రయాణాలు చేయాల్సి వస్తోందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సు డిపో ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
బస్‌డిపో ఏర్పాటు చేయాలి..
- నర్సయ్య, కాగజ్‌నగర్
కాగజ్‌నగర్‌లో బస్‌డిపో ఏర్పాటు చేయాలి. బస్ డిపో ఏర్పాటు చేస్తే సిర్పూరు నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుంది. గిరి గ్రామాలకు మరింత సౌకర్యం కలుగుతుంది. ప్రస్తుతం బస్సులన్నీ కూడా ఆసిఫాబాద్‌డిపో నుంచి రావాల్సి ఉండడంతో చాలా కష్టం అవుతోంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
గ్రామీణ ప్రాంతాలకు సౌకర్యం మెరుగు..
-మాచర్ల శ్రీనివాస్, కాగజ్‌నగర్
ఆర్టీసీ డిపో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతాల్లోని గిరి గ్రామాలకు మరింత సౌకర్యం పెరుగుతుంది. కాగజ్‌నగర్ నుంచే అన్ని గ్రామాలకు బస్సులు పోయేందుకు మార్గం ఉంటుంది. అలాగే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు కూడా రవాణా పెంచుకోవచ్చు. తద్వారా ఆర్టీసీకి ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్టీసీ స్థలం ఉన్నప్ప టికీ కూడా డిపో ఏర్పాటు చేయడం లేదు.