Share News

Domestic Violence: ప్రియుడితో కలిసి భర్తను చంపి..

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:43 AM

పదమూడేళ్ల వైవాహిక బంధం.. ముగ్గురు పిల్లలు. అయినా.. కొత్తగా వచ్చిన ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా హత్య చేసింది ఓ భార్య. ఆపై గుండెపోటుతో చనిపోయాడని బంధువులను నమ్మిం చి..

Domestic Violence: ప్రియుడితో కలిసి భర్తను చంపి..

  • గుండెపోటుగా చిత్రీకరించిన భార్య.. ఆపై హడావుడిగా అంత్యక్రియలు

  • గత నెల 19న హత్య.. తాజాగా నిర్ధారణ

  • మెడపై గాయాలను గుర్తించిన బంధువులు

  • పోలీసులకు మృతుడి తమ్ముడి భార్య ఫిర్యాదు

  • మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం

  • పోలీసుల దర్యాప్తులో నిజాలు వెలుగులోకి

  • హత్యకు పలుమార్లు ప్రయత్నం రూ.35 వేల సుపారీ

  • మృతుడి భార్య సహా ఆరుగురి అరెస్టు

నిజామాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పదమూడేళ్ల వైవాహిక బంధం.. ముగ్గురు పిల్లలు. అయినా.. కొత్తగా వచ్చిన ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా హత్య చేసింది ఓ భార్య. ఆపై గుండెపోటుతో చనిపోయాడని బంధువులను నమ్మిం చి.. హడావుడిగా అంత్యక్రియలు నిర్వహింపజేసింది. అయితే మృతుడి మెడపై గాయాలుండడం చూసి బంధువులు అనుమానించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం, మృతదేహాన్ని సమాధి నుంచి బయటికి తీసి పోస్టుమార్టం చేయడంతో హత్య కోణం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని బోర్గం (కే) గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లటి రమేష్‌(35) అనే వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురయ్యాడు. గత డిసెంబరు 20న రమేశ్‌ గుండెపోటుతో మృతి చెందాడని అతడి భార్య పల్లటి సౌమ్య కుటుంబ సభ్యులకు చెప్పగా.. అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ క్రమంలో రమేష్‌ మెడపై గాయాలు కనిపించాయని బంధువులు ఇజ్రాయెల్‌లో ఉన్న అతని తమ్ముడు కేదార్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అతడు తన భార్యతో పోలిసులకు ఫిర్యాదు చేయించాడు. దీంతో డిసెంబరు 24న మృతదేహాన్ని సమాధి నుంచి తవ్వి తీసి.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు.


వివాహేతర సంబంధం వెలుగులోకి..

పోలీసుల విచారణలో మృతుడి భార్య పల్లటి సౌమ్యకు నందిపేట మండలం బాద్గుణకు చెందిన నాలేశ్వర్‌ దిలీ్‌పతో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. వీరి సంబంధంపై రమేష్‌ తరచూ భార్యపై అనుమానాలు వ్యక్తం చేసేవాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని సౌమ్య తన ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర పన్నింది. తొలుత గతేడాది ఆగస్టులో రమేష్‌ ఆర్మూర్‌ నుంచి బైక్‌పై వస్తుండగా చిన్నాపూర్‌ గండి వద్ద దిలీప్‌, అతడి తమ్ముడు కలిసి కారుతో గుద్ది చంపడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. తిరిగి డిసెంబరు మూడో వారంలో సౌమ్య, ఆమె ప్రియుడు.. మరికొందరు వ్యక్తులతో కలిసి రమేశ్‌ను చంపాలని పథకం వేశారు. ఇందుకోసం సౌమ్య తన బంగారు ఉంగరాన్ని ప్రియుడు దిలీ్‌పకు ఇచ్చింది. అతడు దానిని కుదువ పెట్టి వచ్చిన రూ.35 వేలతో తన తమ్ముడైన మాదాపూర్‌ గ్రామానికి చెందిన అభిషేక్‌ను సంప్రదించాడు. అభిషేక్‌ తన స్నేహితుడు బంటు జితేందర్‌ను దిలీ్‌పకు పరిచయం చేశాడు. జితేందర్‌.. వేణు కిసాన్‌నగర్‌ తండాకు చెందిన కేలోత్‌ శ్రీరాం, రమావత్‌ రాకేశ్‌, మోసిన్‌లను దిలీ్‌పకు పరిచయం చేశాడు. అనంతరం రమే్‌షను చంపాలంటూ శ్రీరాం, రాకేశ్‌, మోసిన్‌లకు సుపారీగా డిసెంబరు 16న రూ.20 వేలు, 19న రూ.10వేలు ఇచ్చి హత్యకు పథకం పన్నాడు.

నిద్ర మాత్రలు ఇచ్చి...

డిసెంబరు 19 రాత్రి సౌమ్య తన భర్త రమేశ్‌కు భోజనం అనంతరం తాగునీటిలో సుమారు 10 నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. అతడు నిద్రలోకి జారుకోగానే ఆమె ప్రియుడు దిలీ్‌పకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చింది. దిలీప్‌ సుపారీ తీసుకున్న వ్యక్తులకు ఫోన్‌ చేయగా వారు స్పందించలేదు. దీంతో దిలీప్‌ స్వయంగా అభిషేక్‌ను వెంటబెట్టుకొని అదే రాత్రి బైక్‌పై బోర్గా (కే) గ్రామానికి వెళ్లాడు. ఆపై సౌమ్యతో కలిసి నిద్రలో ఉన్న రమేష్‌ మెడపై టవల్‌తో ఉరివేశారు. దిండుతో ముక్కు, నోరు అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. మర్నాడు ఉదయం రమేష్‌ గుండెపోటుతో చనిపోయాడని సౌమ్య బంధువులను నమ్మించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. దర్యాప్తు అనంతరం హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న సౌమ్య, దిలీప్‌, అభిషేక్‌, సుపారీ గ్యాంగ్‌ అయిన జితేందర్‌, శ్రీరాం, రాకేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మోసిన్‌ పరారీలో ఉన్నాడు. ఈ కేసును ఛేదించిన నార్త్‌ రూరల్‌ సీఐ శ్రీనివా్‌సను, ఎస్‌ఐ రాజశేఖర్‌ను ఏపీసీ రాజవెంకట్‌రెడ్డి అభినందించారు.

Updated Date - Jan 06 , 2026 | 01:43 AM