Share News

మేనల్లుడితో కలిసి భర్తను చంపిన భార్య

ABN , Publish Date - Jan 29 , 2026 | 06:07 AM

మేనల్లుడితో తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో కట్టుకున్న భర్తనే చంపేసిందో భార్య. మేనల్లుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడిన ఆమె..

మేనల్లుడితో కలిసి భర్తను చంపిన భార్య

  • వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఘాతుకం

  • నల్లగొండ జిల్లా సీత్యాతండాలో ఘటన

మాడ్గులపల్లి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మేనల్లుడితో తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో కట్టుకున్న భర్తనే చంపేసిందో భార్య. మేనల్లుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడిన ఆమె.. హత్య అనంతరం మేనల్లుడితో కలిసి పరారైంది. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం సీత్యాతండాలో బుధవారం ఈ ఘటన జరిగింది. సీత్యాతండాకు చెందిన రమావత్‌ రవి(34)కి మిర్యాలగూడ మండలం ఏడుకోట్లతండాకు చెందిన లక్ష్మితో 11ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు సూర్యాపేటలో చదువుతుండగా, చిన్న కుమారుడు మానసిక దివ్యాంగుడు. రవి వేములపల్లి మండలం సల్కునూరు పీఏసీఎ్‌సలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. అయితే, రవి అక్క కుమారుడైన గణేశ్‌తో లక్ష్మికి వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవలు జరగ్గా లక్ష్మి ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. రవి తల్లిదండ్రులు పెద్ద మనుషులతో మాట్లాడి లక్ష్మిని తిరిగి అత్తారింటికి తీసుకొచ్చారు. జనవరి 26న భార్యాభర్తల మధ్య మరోమారు గొడవ జరిగింది. అయితే, రవి పెద్ద కుమారుడిని హాస్టల్‌కు చేర్చేందుకు అతని తండ్రి లక్ష్మానాయక్‌ జనవరి 27న సూర్యాపేట వెళ్లగా, తల్లి పొలం పనికి వెళ్లింది. వారు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి కుమారుడి గదిలో లైట్లు వెలుగుతుండటంతో పెద్దగా పట్టించుకోలేదు. బుధవారం ఉదయం కొడుకు, కోడలు గది నుంచి రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపు తీసి చూడగా రవి విగతజీవిగా పడి ఉన్నాడు. అయితే, హైదరాబాద్‌లోని ఓ బంగారం దుకాణంలో పనిచేస్తున్న మేనల్లుడు మాలోతు గణేశ్‌కు ఈ నెల 27న ఫోన్‌ చేసిన లక్ష్మి.. అతడిని ఇంటికి పిలిపించినట్టు పోలీసు విచారణలో తేలింది. మద్యం మత్తులో ఉన్న రవిపై లక్ష్మి, గణేశ్‌ దాడి చేయగా అక్కడికక్కడే మృతిచెందాడని పోలీసులు తెలిపారు. కాగా, గణేశ్‌తోపాటు లక్ష్మి, మానసిక దివ్యాంగుడైన ఆమె చిన్న కుమారుడు ఆచూకీ కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

Updated Date - Jan 29 , 2026 | 06:08 AM