Share News

నిర్దోషివైతే ఎందుకు భయం..?

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:34 AM

ఫోన్‌ ట్యాపింగ్‌తో సంబంధం లేకపోతే.. నిర్దోషులైతే భయపడాల్సిన అవసరం ఏమిటని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.

నిర్దోషివైతే ఎందుకు భయం..?

  • కేటీఆర్‌ను ప్రశ్నించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంఽధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌తో సంబంధం లేకపోతే.. నిర్దోషులైతే భయపడాల్సిన అవసరం ఏమిటని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో కేవలం కేసీఆర్‌ హయాంలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి నీచ రాజకీయాలను చూశామని విమర్శించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ప్రజా భవన్‌లో శనివారం జూపల్లి మీడియాతో మా ట్లాడారు. 2021 నుంచీ రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు వెల్లువెత్తాయన్నారు. తన ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ అయిందని రాష్ట్ర మాజీ గవర్నర్‌ తమిళసై చెప్పారన్న జూపల్లి.. మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి, మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ కూడా తమపై నిఘా పెట్టారని గతంలోనే అనుమానాలు వ్యక్తం చేశారని చెప్పారు. సొంత పార్టీ నేతలను, విపక్ష నేతలను, వ్యాపారవేత్తలను బ్లాక్‌ మెయిల్‌ చేయడానికి నిఘా వ్యవస్థను వాడుకోవడం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టని అన్నారు. ‘గత ప్రభుత్వంలో అర్థరాత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టి.. ప్రొఫెసర్‌ కోదండరాం వంటి వారిని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు మీ రాజకీయ విలువలేమయ్యాయి’ అని కేటీఆర్‌ను నిలదీశారు. ‘మేము అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపులకు దిగలేదు. మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. కేవలం సాక్షిగా సమాచారం అడిగేందుకు సీఆర్‌పీసీ కింద నోటీసు ఇస్తేనే ఇంత భయపడి పోవాలా..?’ అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - Jan 25 , 2026 | 03:34 AM