Share News

కొత్త డీజీపీ ఎవరు?

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:43 AM

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ ఎవరు ? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ నూతన డీజీపీ నియామక ప్రక్రియను యూపీఎస్సీ మళ్లీ కొత్తగా ప్రారంభించగా..

కొత్త డీజీపీ ఎవరు?

  • యూపీఎస్సీకి పంపిన జాబితాపై రాష్ట్ర ప్రభుత్వం గోప్యత

  • సుప్రీం తీర్పు నేపథ్యంలో శివధర్‌రెడ్డి పేరుపై పోలీసు వర్గాల్లో చర్చ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ ఎవరు ? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ నూతన డీజీపీ నియామక ప్రక్రియను యూపీఎస్సీ మళ్లీ కొత్తగా ప్రారంభించగా.. డీజీపీ పదవికి రాష్ట్ర ప్రభుత్వం పలువురు అధికారుల పేర్లను సూచిస్తూ జాబితాను పంపించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయనే అంశం పోలీసు వర్గాలు తీవ్ర చర్చనీయాంశమైంది. డీజీపీ పోస్టుకు అర్హులైన అధికారుల పేర్లను సిఫారసు చేయమని కోరుతూ ఫిబ్రవరి 20న యూపీఎస్సీ నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ వచ్చింది. ఫిబ్రవరి 5వ తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందులో ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం సీవీ ఆనంద్‌, శివధర్‌ రెడ్డి, వినాయక్‌, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్‌ పేర్లను యూపీఎస్సీకి పంపిందని చెబుతున్నారు. అయితే, ఈనెల 5న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రం నుంచి యూపీఎస్సీకి వెళ్లిన జాబితాలో శివధర్‌ రెడ్డి పేరు ఉండే అవకాశం లేదు. ఆయనకు ఇంకా రెండు నెలల సర్వీస్‌ మాత్రమే మిగిలి ఉండడం ఇందుకు కారణం. నిజానికి, ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌లో యూపీఎస్సీకి పంపిన జాబితా ప్రకారమైతే శివధర్‌ రెడ్డికి అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో యూపీఎస్సీకి వెళ్లిన జాబితాలో శివధర్‌ రెడ్డి పేరు ఉందా లేదా అనేది పోలీసువర్గాల్లో చర్చకు దారి తీసింది. తుది జాబితా విషయంలో ప్రభుత్వం కూడా గోపత్య పాటిస్తుండడం గమనార్హం.

Updated Date - Feb 27 , 2026 | 04:43 AM