Share News

ఆర్టీసీలో ’చక్రం’ తిప్పేదెవరో..?

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:17 AM

ఆర్టీసీలో ఎన్నికల కోలాహలం తుది అంచెకు చేరుకుంది. కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ప్రచారానికి గురువారంతో తెరపడనుంది. శుక్రవారం గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనుండడంతో ఓటర్లైన రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు ఎవరికి పట్టం కడతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. దశాబ్ద కాలం తర్వాత

ఆర్టీసీలో ’చక్రం’ తిప్పేదెవరో..?

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌/ భగత్‌నగర్‌)

ఆర్టీసీలో ఎన్నికల కోలాహలం తుది అంచెకు చేరుకుంది. కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ప్రచారానికి గురువారంతో తెరపడనుంది. శుక్రవారం గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనుండడంతో ఓటర్లైన రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు ఎవరికి పట్టం కడతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. దశాబ్ద కాలం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలను ఆయా గుర్తింపు సంఘాలు సవాలుగా స్వీకరించాయి. ప్రచారపర్వంలో నువ్వా-నేనా అనే విధంగా హామీలతో హోరెత్తించాయి. తమకు పట్టం కడితే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పించాయి. పోటాపోటీగా మేనిఫెస్టోలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో అసలు ఉద్యోగులు ఎవరికి మద్దతును తెలుపుతారనే విషయంలో సందిగ్ధత నెలకొంది. పోలింగ్‌కు ఇంకొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉండడంతో చివరి అంకం ప్రచారాన్ని సాగించేందుకు సంఘాలు సిద్ధమయ్యాయి.

ఫ డిమాండ్ల సాధనే లక్ష్యంగా..

ఈ ఎన్నికలు గుర్తింపు కోసమే కాకుండా ఉద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన వ్యవహారంగానే సిబ్బంది భావిస్తున్నారు. కొన్నాళ్లుగా ఏ సమస్య వచ్చినా సంఘాల తోడ్పాటు లేక ఇబ్బందులు పడిన సందర్భాలను గుర్తుకు తెచ్చుకుంటూనే ఎలాగైనా నచ్చిన సంఘానికి జైకొట్టాలనే భావనలో డ్రైవర్లు, కండక్టర్లున్నారు. ఇదే సమయంలో పోటీ చేస్తున్న గుర్తింపు సంఘాలు కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని ప్రధాన ఎజెండాగా చెబుతున్నాయి. ఇదే కాకుండా పీఆర్సీ, పెండింగ్‌ బకాయిలు, ఉద్యోగుల నియామకాలు, పనిభారం, ఉద్యోగ భద్రత వంటి కీలకమైన అంశాలను నెరవేరుస్తామని మాటిస్తూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునే పయ్రత్నాలు చేశారు. కర పత్రాల పంపిణీతోపాటు ప్రచార సమవేశాలను డిపోల వద్ద నిర్వహించి తమ పట్టును నిలబెట్టుకునే తపనను సంఘం ప్రతినిధులు చూపించారు. జిల్లాలో కరీంనగర్‌-1, కరీంనగర్‌-2 డిపోలతోపాటు హుజూరాబాద్‌ డిపో పరిధిలో మొత్తం 981 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఆర్‌ఎం ఆఫీస్‌, ఆర్టీసీ వర్క్‌షాప్‌లోని సిబ్బంది కూడా వారి ఓటును వినియోగించుకోనున్నారు.

ఫ రెండు బ్యాలెట్‌ పత్రాలు..

శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిపోల్లో పోలింగ్‌ ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సిబ్బంది ఓటర్లకు రెండు బ్యాలెట్‌ పత్రాలను అందిస్తారు. వాటిలో ఆయా గుర్తింపు సంఘాలకు సంబంధించిన గుర్తులను ఎంచుకుని ఓటెయ్యాల్సి ఉంటుంది. రహస్య ఓటింగ్‌ విధానంలో భాగంగా ఒక బ్యాలెట్‌ పత్రంలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కోసం ఒక సంఘం గుర్తుపై ఓటు వేయాలి. రెండో బ్యాలెట్‌ పత్రంలో రీజియన్‌/ స్థానిక గుర్తింపు కోసం ఇష్టమైన సంఘానికి మద్దతు తెలిపేలా ఓటరు తన హక్కును వినియోగించుకోవాలి. ఈసారి ఎన్నికల కోసం రాష్ట్రస్థాయిలో గురర్తింపు పొందిన 12 సంఘాలు బరిలో ఉండగా ప్రధాన పోటీ మాత్రం రెండు, మూడు సంఘాల మధ్యనే కొనసాగుతోంది. ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, స్టాఫ్‌ ఆండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌, కార్మిక సంఘ్‌, కార్మిక పరిషత్‌, బహుజన వర్కర్స్‌ యూనియన్‌, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌(టీడబ్ల్యూయూ)స్టాఫ్‌ ఆండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, సామాజిక తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, బహుజన కార్మిక యూనియన్‌, తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌లున్నాయి. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌(టీడబ్ల్యూయు)కు కాంగ్రెస్‌ పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ ప్రచారం జోరుని పెంచింది. దీనికి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూ ఎఫ్‌) తోడైంది. వీరికితోడుగా ఐఎన్‌టీయూసీ అనుబంధంగా ఉన్న స్టాఫ్‌ ఆండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జత కట్టి కూటమిగా ఏర్పడ్డాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని వీరు ప్రధాన హామీగా ఎంచుకున్నారు. వీరికి ప్రత్యర్థిగా సీపీఐ అనుబంధ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రచారంలో గట్టి పోటీనిస్తోంది. ఎంప్లాయిస్‌ యూనియన్‌తోపాటు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ), నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయూ)తో కలిసి ఈ ఎన్నికల్లో జేఏసీగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఎవరికి వారుగా నాయకులు తమ సంఘం గెలుపు ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఓట్లను 17న లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.

Updated Date - Oct 08 , 2026 | 12:17 AM