Share News

aడబ్బులు ఎక్కడి నుంచి వస్తాయ్‌..

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:35 AM

మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూలు నేడో, రేపో వెలువడనున్న నేపథ్యంలో మోత్కూరు మునిసిపాలిటీలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు ముమ్మర కరసత్తు చేస్తున్నాయి.

aడబ్బులు ఎక్కడి నుంచి వస్తాయ్‌..

ఎన్నికల్లో పోటీ చేయొద్దంటున్న సతీమణులు

అప్పులు చేస్తే వడ్డీలు పెరుగుతాయని హెచ్చరిక

మోత్కూరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూలు నేడో, రేపో వెలువడనున్న నేపథ్యంలో మోత్కూరు మునిసిపాలిటీలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు ముమ్మర కరసత్తు చేస్తున్నాయి. వార్డుల వారీగా నియమించిన పరిశీలకులు వార్డు సమావేశాలు నిర్వహించి, పార్టీ కార్యకర్తలను, ఓటర్లను విచారిస్తున్నారు. పార్టీ ఏదైనా ఎన్నికల్లో పోటీ చేయాలంటే తొలత ప్రధానంగా డబ్బు సమస్యనే చర్చకు వస్తోంది. గెలవలాంటే భారీగా డబ్బు ఖర్చవుతుందని, నీవు అంత ఖర్చు భరించగలవా అంటూ నాయకులు ఆశావహులను అడుగుతున్నట్టు చెబుతున్నారు. డబ్బే ప్రధానమైనప్పుడు ఎండనక, వాననక పార్టీ కోసం ఏళ్ల తరబడి తాము కష్టపడిందెందుకంటూ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. రిజర్వేషన్లు ఖరారై, ఎన్నికల షెడ్యూలు నేడో, రేపో వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. చైర్మన్‌ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో చైర్మన్‌ రేస్‌లో ఉన్న అభ్యర్థి ఇతర వార్డుల అభ్యర్థులకు పెద్దగా ఇచ్చేది ఏమీ ఉండదని, పార్టీ ఫండ్‌ కూడా ఏమీ రాదంటూ ఎవరికి వారే ఖర్చు పెట్టుకోవాలని చెబుతున్నట్టు తెలిసింది. ఒక్కో వార్డులో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని లెక్కలు వేసుకుని కొందరు ఆశావహులను వారి సతీమణులు, తల్లిదండ్రులు, సన్నిహితులు అన్ని డబ్బులు ఎక్కడ తెచ్చి పెడతావు, అప్పులు చేస్తే వడ్డీలు పెరుగుతాయి. ఆమ్‌దానీ ఏమీ ఉండదు పోటీ వద్దు, ఏమొద్దంటున్నట్టు చెబుతున్నారు. ఓడితే ఆరిపోతాం, గెలిస్తే గౌరవం ఉంటుందేమో గాని, నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు అని తిట్లు తప్ప ఏం మిగులుందని ప్రశ్నిస్తున్నారంటున్నారు. ఎన్నికల ఖర్చుకు భయపడి కొందరు వెనుకడుగు వేస్తుండగా మరి కొందరు ఏదేమైనా పోటీ చేస్తామంటూ పార్టీ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ఒక్కో వార్డులో ఐదారుగురు పోటీ పడుతుండగా అభ్యర్థులను ఎంపిక చేయలేక నాయకులు సతమతమవుతున్నారు. కొన్ని వార్డుల్లో రెబల్స్‌ బెడద తప్పేలా లేదంటున్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:39 AM