Share News

26.97 లక్షల ఎకరాలు ఏమైనట్లు?

ABN , Publish Date - Aug 29 , 2026 | 05:07 AM

తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 2,76,94,830 ఎకరాలు. ఇటీవల రెవెన్యూ శాఖ భూభారతిలో నమోదు చేసిన విస్తీర్ణం 2,49,97,312 ఎకరాలు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 26,97,518 ఎకరాలు. ఇది మొత్తం భూముల్లో 9.74 శాతానికి సమానం.

26.97 లక్షల ఎకరాలు ఏమైనట్లు?

  • రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 2.76 కోట్ల ఎకరాలు

  • భూభారతిలో నమోదు 2.49 కోట్ల ఎకరాలు

  • రెవెన్యూశాఖ లెక్కలకు ఆయా శాఖల లెక్కలకూ మధ్య గణనీయమైన తేడాలు

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 2,76,94,830 ఎకరాలు. ఇటీవల రెవెన్యూ శాఖ భూభారతిలో నమోదు చేసిన విస్తీర్ణం 2,49,97,312 ఎకరాలు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 26,97,518 ఎకరాలు. ఇది మొత్తం భూముల్లో 9.74 శాతానికి సమానం. అంటే, సగటున ప్రతి 100 ఎకరాల్లో 10 ఎకరాలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. భూములు రకరకాలు. సాగు, అటవీ, చెరువులు, రోడ్లు, గ్రామాలు, పట్టణాల ఆధారంగా విభజిస్తారు. రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వేలో, అధికారిక నివేదికల్లో భూ వినియోగాన్ని ఇలా పలు రకాలుగా చూపుతున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో మొత్తం భూముల లెక్కలు కచ్చితంగా ఒకే రకంగా ఉంటాయని చెప్పలేం. కానీ, ఏకంగా దాదాపు 27 లక్షల ఎకరాల తేడా ఉండటం మాత్రం చర్చనీయాంశమే.


రికార్డుల్లోనూ గందరగోళమే

అటవీ, దేవాదాయ, వక్ఫ్‌, భూదాన్‌ భూముల రికార్డుల్లో గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. రెవెన్యూశాఖ లెక్కల ప్రకారం అటవీ భూములు 42,61,531 ఎకరాలు. స్వయంగా అటవీశాఖవద్ద ఉన్న రికార్డులు, సామాజిక ఆర్థిక సర్వేలో పేర్కొన్న నివేదికల ప్రకారం చూస్తే అటవీ భూములు 66,33,313 ఎకరాలు. వీటి మధ్య ఉన్న వ్యత్యాసం 23,71,782 ఎకరాలు. ఇంత పెద్ద మొత్తంలో తేడా ఎందుకొచ్చిందనేది ప్రశ్నార్థకం. ఇక దేవాదాయ భూములను చూస్తే రెవెన్యూశాఖ లెక్కల ప్రకారం 49,143 ఎకరాలు ఉంది. కానీ, దేవాదాయ శాఖ రికార్డుల్లో ఉన్న భూమి 73 వేల ఎకరా లు. తేడా 24వేల ఎకరాలు. వక్ఫ్‌ భూములకు సంబంధించి కూడా పొంతన లేని లెక్కలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రకారం రాష్ట్రంలో 1,43,305 ఎకరాల వక్ఫ్‌ భూములున్నాయి. కాగా, ఈ క్యాటగిరీలో ఎన్ని ఎకరాలు ఉందో రెవెన్యూ శాఖ ఇటీవల ఇచ్చిన భూముల లెక్కల్లో వెల్లడించలేదు. భూదాన్‌ బోర్డు లెక్కల ప్రకారం రాష్ట్రంలో భూదాన్‌ భూములు 1.79 లక్షల ఎకరాలు. వీటికి రెవెన్యూ శాఖ వివరాలు తెలియజేయలేదు. మొత్తమ్మీద, భూముల విషయంలో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనిని రాష్ట్ర రెవెన్యూశాఖనే తొలగించి, స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

Updated Date - Aug 29 , 2026 | 05:08 AM