Share News

kumaram bheem asifabad- సాదా బైనామాల పరిష్కారం ఎన్నడో..?

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:30 PM

జిల్లాలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఇంకా కొలిక్కి రావడం లేదు. ఏళ్ల తరబడి ఈ దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం కలుగడం లేదు. న్యాయపరంగా అనేక సమస్యలు ఎదురతుండడంతో ఎలా ముందుకు వెళ్లాలనేది ప్రభుత్వానికి సైతం అంతుపట్టని పరిస్థితి నెలకొంది.

kumaram bheem asifabad- సాదా బైనామాల పరిష్కారం ఎన్నడో..?
లోగో

కాగజ్‌నగర్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఇంకా కొలిక్కి రావడం లేదు. ఏళ్ల తరబడి ఈ దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం కలుగడం లేదు. న్యాయపరంగా అనేక సమస్యలు ఎదురతుండడంతో ఎలా ముందుకు వెళ్లాలనేది ప్రభుత్వానికి సైతం అంతుపట్టని పరిస్థితి నెలకొంది. సాదాబైనామాను పరిష్కారించాలంటే భూమి విక్రయించిన వ్యక్తుల నుంచి అఫిడవిట్‌తో పాటు కొనుగోలు చేసిన వారి దగ్గర సరైన పత్రాలు ఉండాలి. గత ప్రభుత్వ హయం నుంచే పలుమార్లు సాదాబైనామా తెరపైకి రాగా, తెల్లకాగితాలపై చేసుకున్న భూ క్రయ, విక్రయాల సమస్య నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ప్రభుత్వం ప్రతీసారి సాదాబైనామాల విషయాన్ని ప్రస్తావిస్తున్నా పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు. దీనికి ప్రధానంగా గత యజమానుల అఫిడవిట్‌ లేక పోవడం, వారుసులు అభ్యంతరాలు తెలపడం, 2016 తరువాత జమబందీ నిలిచి పోవటంతో రికార్డుల్లో మార్పలు, చేర్పులు చేయటం కష్టంగా మారింది. తాజాగా విక్రయించిన వ్యక్తి అఫిడవిట్‌ ఇవ్వాల్సిందేనని, కొనుగోలు చేసిన వ్యక్తి తప్పుడు రికార్డు సృష్టిస్తే చర్యలకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి వివాదాలు లేనట్లయితేనే దరఖాస్తులను పరిష్కరించి పట్టా జారీ చేసే అవకాశం ఉంటుంది.

- ఏళ్ల తరబడి పట్టాలు లేక

ఏళ్ల తరబడి పట్టాలు లేక పోవడంతో రుణాలతో పాటు రైతు భరోసా అందడం లేదని సాదాబైనామా రైతులు వాపోతున్నారు. జిల్లాలో 1,800 మంది సాదాబైనామాల దరఖాస్తులను చేసుకున్నారు. ఈ దరఖాస్తుల ఆధారంగా సర్వేలు చేశారు. ప్రస్తుత మోకాలో ఎవరున్నారు..? గత యాజమాని ఎవరు..? ఎందుకు పెండింగ్‌లో ఉందన్న అంశాలను పరిగణలోకి తీసుకొని రెవెన్యూ స్థాయి సిబ్బంది క్షేత్ర స్థాయిలో విచారణ జరిపారు. ఇంత వరకు వీటి విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. తెల్లకాగితాలు, స్టాంప్‌ పేపర్ల ఆధారంగా భూములు కొనుగోలు చేసిన వారు వాటిని సాగు చేసుకుంటున్నప్పటికీ పలు సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్‌ కూడా కావడం లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండు మార్లు సాదాబైనామాల దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో అతి తక్కువ దరఖాస్తులను పరిష్కరించింది. ధరణి ప్రక్రియ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియ పూర్తిగా బ్రేక్‌ పడింది. ఈ ధరణిలో భూమి యాజమాను పేరు రావడంతో అనుభదారుల పేర్లు తొలగించడంతో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. 1954 నుంచి వచ్చిన వారి పేర్లనే యాజమానులుగా పరిగణించారు. బీఆర్‌ఎస్‌ హాయంలో ఈ భూములకు పరిష్కారం దొరకలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూ భారతి ప్రవేశపెట్టింది. సాదాబైమానాల సమస్యను పరిష్కరించేందుకు కమిటీలను వేసింది. రెండేళ్లు గడిచినా కేవలం సర్వేలు, విచారణ చేపట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వీరికి అనుమతి రాలేదు. దీంతో రైతు బంధు, కేంద్ర ప్రభుత్వం అందించే సహాయం కూడా అందడం లేదు. జిల్లాలోని సాదాబైనామాల దరఖాస్తులు తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ మధూకర్‌ను వివరణ కోరగా, సాదాబైనామాల విషయంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సర్వేలు పూర్తి చేశామని చెప్పారు. ఈ నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించినట్టు తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Mar 21 , 2026 | 11:31 PM