కుట్టుమిషన్లు అందేదెన్నడో..?
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:40 AM
రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దరఖాస్తుల స్వీకరణను ఆగస్టు 13వ తేదీ నుంచి ప్రారంభించారు. దరఖాస్తు గడువు సైతం సెప్టెంబరు 30వ తేదీతో ముగిసింది. ఈ మేరకు జిల్లాలోని 20 మండలాలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో
జగిత్యాల, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దరఖాస్తుల స్వీకరణను ఆగస్టు 13వ తేదీ నుంచి ప్రారంభించారు. దరఖాస్తు గడువు సైతం సెప్టెంబరు 30వ తేదీతో ముగిసింది. ఈ మేరకు జిల్లాలోని 20 మండలాలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో 27,259 మంది మహిళలు కుట్టుమిషన్ల కోసం దరఖాస్తులు అందజేశారు.
ఫనియోజకవర్గానికి వెయ్యి మిషన్లు..
జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వెయ్యి ఆటోమెటిక్ కుట్టు మిషన్లు వంద శాతం సబ్సిడీపై అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు పథకం అమలుపై స్పష్టత రాలేదు. బీసీ కుటుంబాల్లోని కుట్టుపనిపై ఆధారపడి జీవనోపాధి పొందాలనుకునే మహిళలకు కుట్టుమిషిన్లు అందించాలనే పథకం అమలుపరచడంతో దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. అసలు కుట్టుమిషన్లు అందుతాయా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సరైన విధి విధానాలు రాకపోవడంతో అధికారులు, లబ్ధిదారులు తర్జన భర్జన పడుతున్నారు.
ఫజాప్యంపై దరఖాస్తులదారుల అసంతృప్తి
మహిళలకు స్వయం ఉపాధి కల్పించే కుట్టుమిషన్ల పంపిణీ పథకంపై నిర్లక్షం్యగా వ్యవహరించడం సరికాదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు కుట్టుమిషన్లు అందించడంతో పాటు అవసరమైన శిక్షణ, ఆర్థిక సహాయం, మార్కెటింగ్ అవకాశాలు కల్పించినప్పుడే ప్రయోజనం చేకూరుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి కుట్టుమిషన్లు అందించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
విధివిధానాలు రాగానే కార్యాచరణ
-జయరాజ్, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి
ఇందిరమ్మ కుట్టుమిషన్ పథకం కింద 27,259 వరకు దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం నుంచి విధి విధానాలు రాగానే కార్యాచరణ చేపడుతాం. అప్పటి వరకు వేచి చూడాలి. మండల కమిటీలు కూడా ఉంటాయి. అందులో అర్హులైన వారిని గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాల అందిన వెంటనే ఆ పథకం అమలుకు చర్యలు చేపడతాం.
జిల్లాలో దరఖాస్తులు ఇలా..
--------------------------------------------
మండలం....దరఖాస్తులు
--------------------------------------------
బీర్‌పూర్ - 793
భీమారం - 484
బుగ్గారం - 589
ధర్మపురి - 1,261
ఎండపల్లి - 688
గొల్లపల్లి - 1,529
ఇబ్రహీంపట్నం - 831
జగిత్యాల రూరల్ - 1,572
జగిత్యాల అర్బన్ - 1,825
కథలాపూర్ - 1,258
కొడిమ్యాల - 1,370
కోరుట్ల - 1,051
మల్లాపూర్ - 1,292
మల్యాల - 1,576
మేడిపల్లి - 796
మెట్‌పల్లి - 1,112
పెగడపల్లి - 1,221
రాయికల్ - 1,460
సారంగాపూర్ - 794
వెల్గటూరు - 903
--------------------------------------------
మున్సిపాలిటీ....దరఖాస్తులు
--------------------------------------------
జగిత్యాల - 1,397
కోరుట్ల - 1,279
మెట్‌పల్లి - 1,115
ధర్మపురి - 573
రాయికల్ - 490
--------------------------------------------
జిల్లా మొత్తం - 27,259
--------------------------------------------