సమస్యలు తీరేదెన్నడు..?
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:47 PM
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమస్యలు తిష్టవేశాయి. దశాబ్దాల కాలంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల నగరా నికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
-అటకెక్కిన మినీ ట్యాంక్ బండ్‌ల ఏర్పాటు
-అర్ధాంతరంగా నిలిచిన బైపాస్ రోడ్డు పనులు
-స్టేడియం నిర్మాణంలో అంతులేని జాప్యం
-ఊసేలేని రింగు రోడ్డు నిర్మాణం
-దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పార్కులు
మంచిర్యాల, జూలై 14 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమస్యలు తిష్టవేశాయి. దశాబ్దాల కాలంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల నగరా నికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పూర్తిస్థాయి వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న మంచిర్యాలలో నిత్యం కోట్ల రూపాయల్లో వివిధ వ్యాపార లావాదేవీలు కొనసాగుతుంటాయి. మంచిర్యాలలో న్యూఢిల్లీ-హైద్రాబాద్ ప్రధాన రైల్వే మార్గం ఉండటంతో గుర్తింపు పొం దింది. పేరుకు పెద్ద నగరమే అయినప్పటికీ ఇక్కడ అంతర్గత సమస్యలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడక తప్పడంలేదు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పడ్డప్పటికీ ఇక్కడ జరిగిన అభివృద్ది పెద్దగా ఏమీ లేదనే చెప్పుకోవాలి. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు చొరవతో ఇటీవల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్, అంతర్గత రోడ్ల విస్తరణ చేపడుతున్నా ప్రధాన సమస్యలు తీరక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
దయనీయ స్థితిలో పార్కులు....
మంచిర్యాల నగరంలోని పోచమ్మ చెరువు, రాముని చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా మారుస్తానని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో పెద్దపెల్లి అప్పటి ఎంపీ బాల్క సుమన్ హామీ ఇచ్చారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పట్టణ అభివృద్ది సమావేశంలో పై విధంగా ఆయన హామీల వర్షం కురిపించినప్పటికీ నేటి వరకు ఆ దిశగా కృషి జరగలేదు. అలాగే పట్టణంలో పాత మంచిర్యాల, హైటెక్‌సిటీ, శ్రీశ్రీ నగర్, రెడ్డి కాలనీ, గర్మిళ్ల, తదితర ప్రాంతాల్లో పార్కుల కోసం స్థలం కేటాయించినప్పటికీ వాటిలో రెండు మూడు మినహా ఇతర ప్రాంతాల్లో దశాబ్దాల కాలంగా పిచ్చి మొక్కలతో మూలుగుతున్నాయి. రాముని చెరువు సమీపంలో చిల్డ్రన్స్ పార్కు ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ప్రస్తుతం అది పాడుబడిపోయింది. ప్రస్తుతానికి పట్టణంలో ఒక్క పార్కు కూడా ప్రజలు సేదదీరేందుకు ఉపయోగపడేలా లేదు.
అర్థాంతరంగా నిలిచిన బైపాస్ రోడ్డు....
మంచిర్యాల నగరం శరవేగంగా విస్తరిస్తోంది. జనాభా క్రమేపీ పెరుగుతుండటంతో ఇక్కడ ప్రయాణం కష్టతరంగా మారింది. భారీ వాహనాల రాకపోకలు పెరిగిపోవడంతో నగరంలో ప్రధాన రోడ్లన్నీ నిత్యం బిజీగా మారుతున్నాయి. ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. నగరం చుట్టూ గతంలో రూపొందించిన ప్రకారం రింగు రోడ్డు నిర్మిస్తే బాగుంటుందని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పట్టణంలోని వైశ్యాభవన్ మొదలుకొని తెలంగాణ అమరుల స్థూపం మీదుగా లక్ష్మీటాకీస్ చౌరస్తా నుంచి నేరుగా వేములపల్లి, శ్రీశ్రీనగర్ వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు 2006లో మున్సిపల్ అధికారులు లే అవుట్ 58 ప్రకారం సర్వే నిర్వహించారు. వైశ్యా భవన్ నుంచి లక్ష్మీ టాకీస్ చౌరస్తా వరకు రోడ్డు నిర్మాణం జరుగగా, శ్రీశ్రీ నగర్ వైపు మోక్షం కలగడం లేదు. శ్రీశ్రీ నగర్ వద్ద 100 ఫీట్ల బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రారంభమైనప్పటికీ స్థానిక లయన్స్ భవన్ వద్ద అర్థాంతరంగా నిలిచిపోయింది. వేములపల్లి వద్ద భూ తగాదాల కారణంగా బైపాస్‌రోడ్డు ఆగిపోయింది. దీంతో బోర్డులు ఏర్పాటు చేయడం వరకే బైపాస్‌రోడ్డు పరిమితం అయింది. రాముని చెరువుపై వంతెన నిర్మించాల్సి ఉన్నా దశాబ్దాలుగా ఆ పనులు పెండింగ్ పడుతూనే ఉన్నాయి. మరోవైపు నగరం చుట్టూ 200 ఫీట్ల వెడల్పుతో రింగ్ రోడ్డు నిర్మించాలని మునిసిపల్ మాస్టర్ ప్లాన్‌లో సైతం పొందు పరిచారు. దశాబ్దాలు గడుస్తున్నా ఆ రోడ్డు ఊసే ఎత్తడం లేదు. దీంతో మాస్టర్‌ప్లాన్ ప్రకారం గుర్తించిన రోడ్డు స్థలం పెద్ద మొత్తంలో కబ్జాలకు గురైంది.
నిర్లక్ష్యపు నీడలో స్టేడియం నిర్మాణం....
మంచిర్యాల జిల్లాలో క్రీడాకారులకు కొదువలేదు. క్రీడల కోసం ఆటస్థలం లేకపోవడంతో వారిలో దాగి ఉన్న సృజనాత్మకత బయటికి రావడంలేదు. ప్రస్తుతం క్రీడలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నందున మంచిర్యాల పట్టణంలో స్టేడియం నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలలోనే క్రీడాకారులు అధికంగా ఉన్నారు. ఇక్కడ ఎన్‌సీసీ కెడేట్ల సంఖ్య కూడా అధికంగా ఉంది. ప్రధాన రైల్వేలైన్ అందుబాటులో ఉండటంతో ఇక్కడ క్రీడా పోటీలు సైతం ఎక్కువగానే జరుగుతుంటాయి. బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో గతంలో మినీ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరుకాగా పనులు చేపట్టక పోవడం మూలంగా అవి వెనక్కి వెళ్లిపోయాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు స్టేడియంలో విషయంలో ప్రత్యేక శ్రద్దతో సాయికుంటలో స్పోర్ట్స్ హబ్ మంజూరు చేయించారు. స్థలం ఎంపిక కూడా పూర్తయినప్పటికీ పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు.
పార్కింగ్ స్థలం ఏర్పాటుపై నిర్లక్ష్యం....
పట్టణం దినదినాభివృద్ది చెందుతున్న తరుణంలో ప్రజల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అదేస్థాయిలో వాహనాల సంఖ్యకూడా గణనీయంగా పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా పట్టణంలో విపరీతమైన రద్దీ నెలకొంటుంది. పట్టణ ప్రజలతోపాటు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంధ్రానికి వచ్చిపోయే వాహన చోధకుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. పండుగలు, ప్రత్యేక దినాల్లో ట్రాఫిక్ సమస్య రెట్టింపవుతోంది. వెంకటేశ్వర టాకీస్ రోడ్డు, ఆర్‌పీ రోడ్డు, కూరగాయల మార్కెట్ ఏరియా నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటుంది. వాహనాలు పార్కు చేసేందుకు చోటు కూడా ఉండటంలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడల్సి వస్తోంది. పార్కింగ్ కోసం కేటాయించాల్సిన భవనాల సెల్లార్లను వాటి యజమానులు దుకాణాలకు కిరాయలకు ఇవ్వడం మూలంగా వాహనాలు రోడ్ల పక్కన నిలిపాల్సి వస్తోంది. దీంతో నిత్యం ట్రాఫిక్ జాంలతో ఇబ్బందులు నెలకొంటున్నాయి. సెల్లార్లలో షాపులను తొలగించి, వాటిని పార్కింగ్ స్థలాలుగా ఉపయోగిస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు, పాలకులు, పోలీసులు ధృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.