Share News

kumaram bheem asifabad- మాస్టర్‌ప్లాన్‌ అమలయ్యేదెప్పుడు..?

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:08 PM

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో మాస్టార్‌ ప్లాన్‌ ఇంకా పట్టాలెక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్‌ భారత్‌ స్కీం 2.0 కింద ఎంపిక కావడం, పట్టణ అభివృద్ధి చేసే దిశగా గత ఏడాది క్రితం ఢిల్లీకి చెందిన సంస్థతో డ్రోన్‌ ద్వారా సర్వేలు చేశారు. ఈ సర్వేల అంశాలను శాటిలైట్‌ ద్వారా మ్యాపింగ్‌ ప్రక్రియ కూడా పూర్తి చేశారు

kumaram bheem asifabad- మాస్టర్‌ప్లాన్‌ అమలయ్యేదెప్పుడు..?
రోడ్డు విస్తరణ చేపట్టాల్సిన ప్రధాన రోడ్డు

- కొత్త పాలకవర్గంపైనే పట్టణవాసుల ఆశలు

కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో మాస్టార్‌ ప్లాన్‌ ఇంకా పట్టాలెక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్‌ భారత్‌ స్కీం 2.0 కింద ఎంపిక కావడం, పట్టణ అభివృద్ధి చేసే దిశగా గత ఏడాది క్రితం ఢిల్లీకి చెందిన సంస్థతో డ్రోన్‌ ద్వారా సర్వేలు చేశారు. ఈ సర్వేల అంశాలను శాటిలైట్‌ ద్వారా మ్యాపింగ్‌ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. కాని ఇంత వరకు అమలు కావడం లేదు. కాగజ్‌నగర్‌లో కొత్తపాలక వర్గం ఏర్పాటైంది. మాస్టర్‌ ప్లాన్‌ అమలు కోసం కొత్తపాలకవర్గంపైనే ఆశలు పెట్టుకున్నారు. గత బీఆర్‌ఎస్‌ హాయంలో కూడా అన్ని మున్సిపాలిటీలో నూతన మాస్టర్‌ ప్లాన్‌ కోసం సర్వేలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా కూడా అమలు కాలేదు.

- పెరిగే జనాభాకు అనుగుణంగా..

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో 2040 సంవత్సరంలో ఉండే జనాభాను దృష్టిలో పెట్టుకొని నూతన మాస్టర్‌ అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇక్కడి వరకు ఆశయం బాగానే ఉన్నప్పటికి ఆచరణలో అమలు కాని పరిస్థితి ఏర్పడింది. పెరుగుతున్న జనాభా కోసం నీటి వసతి, అంతర్గత రోడ్లు, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి అనుసంధానంగా ఉన్న గ్రామాలను వీలినం చేయాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చారు. ప్రస్తుతం మ్యాపింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కాగజ్‌నగర్‌ మాస్టర్‌ ప్లాన్‌ అమలు జరిగితే అన్నీ సమస్య తీరే అవకాశం ఉంది. ప్రధానంగా కాగజ్‌నగర్‌ లారీ చౌరస్తా నుంచి రాజీవ్‌ గాంధీ చౌరస్తా, రాజీవ్‌ గాంధీ చౌరస్తా నుంచి పొట్టి శ్రీరాములు చౌరస్తా, మార్కెట్‌ ఏరియా నిత్యం వివిధ వాహనాలతో రద్దీగా ఉంటుంది. ప్రధాన రోడ్ల విస్తరణ కాక పోవడంతో ప్రతి రోజు ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుంది. పండుగల పూట సమయంలో మాత్రం నడవలేని పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. కాగజ్‌నగర్‌లో ఎస్పీఎం మిల్లుకు ముడిసరుకులను నిత్యం వివిధ లారీల్లో ఇక్కడికి డంపింగ్‌ చేస్తారు. దీంతో రద్దీగా ఉంటుంది. అలాగే వార్డుల్లో కూడా అంతర్గత రోడ్లు ఇరుకుగా ఉండడంతో చిన్న పాటి వాహనం వచ్చిదంటే కూడా పోలేని పరిస్థితి ఏర్పడింది. కొత్తపాలక వర్గం ఏర్పడిన తర్వాత కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో కాగజ్‌నగర్‌ లారీ చౌరస్తా నుంచి రాజీవ్‌ చౌరస్తా, మార్కెట్‌ ఏరియా, రైల్వే గేటు వరకు రోడ్డు విస్తరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు మార్కింగ్‌ కూడా ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఎస్పీఎంలో పని చేస్తున్న కార్మికుల కోసం క్వార్టర్స్‌ ఉండడం, ప్రభుత్వ కార్యాలయం ఉండడం ఇప్పుడు చిక్కు ఏర్పడింది. వీటి విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఒక వైపు మాస్టర్‌ ప్లాన్‌ కాక పోవడం, మరో వైపు అభివృద్ధి పనులు పెండింగ్‌ పడిపోతుండడంతో పట్టణ వాసుల సమస్యలు తీరడం లేదు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఆయా వార్డులకు చెందిన పలువురు నాయకులు మున్సిపల్‌ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. మాస్టర్‌ ప్లాన్‌ అమలు జరిగితే ప్రధానంగా అంతర్గత రోడ్ల సమస్య, ప్రధాన రోడ్ల అనుసంధానం, ప్రధాన కూడళ్ల అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిఽధులు విడుదల చేయనుంది. మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు నోచుకోకపోవడంతో ఈ సమస్యలు ఇంకా తీరని పరిస్థితి ఉంది. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతిని వివరణ కోరగా మాస్టర్‌ ప్లాన్‌ కోసం చేసిన సర్వేలను ఉన్నతాధికారులకు పంపించామని చెప్పారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Apr 03 , 2026 | 11:08 PM