kumaram bheem asifabad- ‘తొలి ముద’్ద ఇంకెప్పుడు..?
ABN , Publish Date - Aug 15 , 2026 | 11:33 PM
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో తొలి ముద్ద అమలుకు నోచుకోవడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లో పోషకాహార లోపం పారదోలడం, వారిని సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వ ఆయా కేంద్రాల ద్వారా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
రెబ్బెన, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో తొలి ముద్ద అమలుకు నోచుకోవడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లో పోషకాహార లోపం పారదోలడం, వారిని సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వ ఆయా కేంద్రాల ద్వారా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గ్రామాల్లోని పిల్లలు తప్పనిసరిగా కేంద్రాలకు వచ్చేలా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం తొలి ముద్ద పేరిట అల్పాహారం అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. మార్చిలో జరిగిన సమీక్షలో మంత్రి సీతక్క కొత్త విద్యా సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు భధ్రాది కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలో పథకం ప్రారంభమైంది. కానీ జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా పిల్లలకు ఇంకా అల్పాహారం అమలు కావడం లేదు. ఆగస్టు నుంచి కార్యక్రమం అమలు కానున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ పథకం కింద చిన్నారులకు రెడీ టు కుక్ ఉక్మా, కిచిడిని అల్పాహారంగా అందించనున్నారు. కాగా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల కొరత అధిగమించేందుకు నియామకాలను చేపట్టనున్నారు. జిల్లాలో 15 మండలాల పరిఽధిలో ఆసిఫాబాద్, వాంకిడి, జైనూరు, కాగజ్‌నగర్, సిర్పూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరేళ్ల లోపు చిన్నారుల్లో పౌష్టికాహర లోపాన్ని అరికట్టి, శారీరక, మానసిక ఎదుగుదలను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- ఆరేళ్ల వయస్సు వరకు..
పిల్లల మొదటి ఆరేళ్ల వయస్సు వారి భవిష్యత్తుకు అత్యంత కీలకమైందని గుర్తించారు. కేంద్రాల్లో 3-6 ఏళ్ల లోపు బాలబాలికలకు ఆట పాటలతో కూడిన విద్యాన భోదన చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రాల్లో ఉడికించిన కోడిగుడ్డుతో పాటు మధ్యాహ్న భోజనం, స్నాక్స్, పాలు అందిస్తున్నారు. బాలామృతం, బాలామృతం ప్లస్, నెలకు 16 కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. పథకం అమలైతే పిల్లల నమోదు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అదికారులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలను పూర్తి స్థాయిలో అరిక ట్టేందుకు పోషక విలువలతో కూడిన అల్పాహార పథకాన్ని తొలి ముద్ద పేరుతో అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటికే ఆయా కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు, ఇతర వసతులు కల్పనతో పాటు ఏకరూప దుస్తులు సైతం పంపిణీ చేశారు. జిల్లాలో ఐదు ఐసీడీఎస్‌ల పరిధిలో 1,006 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చిన్నారులు 39చ153, గర్భిణులు 4,884, బాలింతలు 2,830 ఉన్నారు. కాగా టీచర్ల ఖాళీలు 158, ఆయాల ఖాళీలు 510 ఉన్నాయి. ఖాళీల భర్తీకి ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే జిల్లాలో అల్పాహారం అమలుకు చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారి స్వరూపరాణి తెలిపారు.