kumaram bheem asifabad-వంతెనలు పూర్తయ్యేదెన్నడు..?
ABN , Publish Date - Oct 21 , 2026 | 11:18 PM
దశా బ్దాలు గడుస్తున్నా జిల్లాలో ప్రధాన వంతెన నిర్మాణల పనులు పూర్తి కావడం లేదు. దీంతో ప్రతి ఎడాది వర్షాకాలంలో మారు మూల గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. భౌగోళికంగా భిన్నమైన స్వరూపం కలిగిన ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ప్రత్యక్ష నరకమే. గూడాల నుంచి ప్రధాన పట్టణాలకు రావాలంటే భగీరథ ప్రయత్నం చేయాల్సిందే.
- మారుమూల గ్రామాల ప్రజలకు తప్పని తిప్పలు
ఆసిఫాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): దశా బ్దాలు గడుస్తున్నా జిల్లాలో ప్రధాన వంతెన నిర్మాణల పనులు పూర్తి కావడం లేదు. దీంతో ప్రతి ఎడాది వర్షాకాలంలో మారు మూల గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. భౌగోళికంగా భిన్నమైన స్వరూపం కలిగిన ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ప్రత్యక్ష నరకమే. గూడాల నుంచి ప్రధాన పట్టణాలకు రావాలంటే భగీరథ ప్రయత్నం చేయాల్సిందే. జిల్లాలోని 334పైగా ఆవాసాలకు నేటికీ అసలు రహదారి సౌకర్యమే లేదంటే ఉన్న గ్రామాలకు వాగులు, వంకల రూపంలో వర్షాకాలమంతా అష్టదిగ్బంధనమే. ఇటు ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఐదు ఏజెన్సీ మండలాలతో పాటు కాగజ్‌నగర్ డివిజన్‌లోని బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, పెంచికలపేట, కాగజ్‌నగర్ వరకు అన్ని మండలాల్లో ప్రజలు ఒకే రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో చిన్న చిన్న వాగులు మొదలుకుని ఎర్రవాగు, పెద్దవాగు, ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని వంకలపై నేటికి వంతెనలు లేక పోవడంతో ప్రజానీకం బయట ప్రపంచానికి చేరుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. జిల్లాలో ఇలా చిన్న చితక కల్వర్టు మొదలుకుని భారీ వంతెనల వరకు ఏవీ పూర్తి కాక పోవడంతో ప్రజానీకానికి ఇక్కట్లు తప్పడం లేదు. పనులను వేగిరం చేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో నిర్మాణల పనులు నిలిచిపోయాయని వివిధ మండలాలకు చెందిన ప్రజలు వాపోతున్నారు.
ఏళ్లుగా కొనసా... గుతున్న వంతెనల నిర్మాణాలు :
గ్రామాలకు రవాణా కష్టం తీర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి పూర్తిస్థాయిలో చేరడం లేదు. మారుమూల గ్రామాల ప్రజలు ఇప్పటికి కష్టాలు పడుతున్నారు. కాలంతో కుస్తీ పడుతూ సమస్యల సుడి గుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అయా మండలాల్లోని గ్రామాలలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు దశాబ్దలుగా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసిఫాబాద్ మండ లంలోని పెద్దవాగుపై గుండి వంతెన నిర్మాణ పనులు దశాబ్దన్నర కాలం పాటు కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుండి గ్రామానికి వర్షాకాలంలో వెళ్లడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కెరమెరి మండలంలోని అనార్‌పల్లి, లక్మాపూర్ వంతెన నిర్మాణపనులు అసంపూర్తిగా ఉండడం వల్ల 12 గ్రామాల ప్రజలకు ప్రతి వర్షాకా లంలో రాక పోకలు నిలిచి పోతాయి. దీంతో అయా గ్రామాల ప్రజలు వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.