kumaram bheem asifabad-ఉద్యోగ విరమణ సాయం ఇంకెప్పుడు..?
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:04 PM
అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 30 నుంచి 40 ఏళ్ల పాటు విధులు నిర్వహించి కేవలం జీతంతోనే ఉద్యోగ విరమణ పొందారు. 65 ఏళ్లు నిండిన వారిని తొలగించిన ప్రభుత్వం టీచర్‌కు రూ. 2 లక్షలు, ఆయాల కు రూ. లక్ష ఇస్తామన్న హామీ నెరవేర్చకపోవడంపై ఆవేదనకు గురవుతున్నారు
- ఏదాదిన్నరగా నిరీక్షణ
- జిల్లాలో రిటైర్డు అయిన 39 మంది టీచర్లు, 143 మంది ఆయాలు
ఆసిఫాబాద్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 30 నుంచి 40 ఏళ్ల పాటు విధులు నిర్వహించి కేవలం జీతంతోనే ఉద్యోగ విరమణ పొందారు. 65 ఏళ్లు నిండిన వారిని తొలగించిన ప్రభుత్వం టీచర్‌కు రూ. 2 లక్షలు, ఆయాల కు రూ. లక్ష ఇస్తామన్న హామీ నెరవేర్చకపోవడంపై ఆవేదనకు గురవుతున్నారు. జిల్లాలో మొత్తం 182 మంది ఉద్యోగ విరమణ పొంది రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో 39 మంది టీచర్లు కాగా 143 మంది ఆయాలు ఉన్నారు. ఉద్యోగ విరమణ పొంది ఏడాదిన్నర గడుస్తున్నా వీరికి ఇప్పటికీ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు,ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తూ, ధర్నాలు చేస్తున్న ఫలితం లేకపోవడం వారిని కుంగుబాటుకు గురిచేస్తోంది.
ఫ చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య..
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతోపాటు గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలదే ముఖ్య పాత్ర. ఇదివరకు వీరికి ఉద్యోగ విరమణ గడువు ఉండేది కాదు, ఆరోగ్యం సహకరించే వరకు పని చేసేవారు. జూలై 2024 నుంచి 65ఏళ్లు నిండిన వారిని తొలగించారు. ఈ మేరకు అంగన్‌వాడీ ఉద్యోగులకు తప్పనిసరి రిటైర్‌మెంట్‌ను అమలు చేస్తున్న ప్రభుత్వం రిటైర్‌మెంట్ బెనిఫిట్ కింద టీచర్లకు రూ. లక్ష, ఆయాలకు రూ. 50వేలు ఇస్తామని మొదట్లో ప్రకటించింది. దీనిపై అంగన్‌వాడీ ఉద్యోగులు నిరసన తెలిపారు. అరకొర వేతనాలతో మూడు, నాలుగు దశాబ్దాలు పని చేశామని, ఇప్పుడు ఈ కొద్దిపాటి డబ్బులతో ఎలా బతకాలని ప్రశ్నించారు. వారి ఆందోళనపై ప్రభుత్వం సమీక్షించింది. ఈ మేరకు ఉద్యోగ విరమణ చేసిన టీచర్లకు రూ. 2లక్షలు, ఆయాలకు రూ. లక్ష చొప్పున ఇస్తామని మహి ళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క స్వయంగా ప్రకటిం చారు. వీటితో పాటు ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే చేయూ త పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోక పోవడంతో ఉద్యోగ విరమణ చేసిన టీచర్లు, ఆయాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత కాలం జీతంలో ఎలాం టి ఇబ్బందులు లేకుండా బతికామని, ఇప్పుడు పోషణ భారంగా మారందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందజేయడంతో పాటు పింఛన్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఫ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందలేదు..
- లలితదేవి, రిటైర్డ్ అంగన్‌వాడీ టీచర్, ఆసిఫాబాద్
ఉద్యోగ విరమణ పొంది ఏడాదిన్న గడుస్తున్నా రిటైర్ మెంట్ బెనిఫిట్స్ అందలేదు. వయస్సు అయిపోయందని ఉద్యోగం నుంచి తొలగించారు. 40 ఏళ్లకు పైగా ఉద్యోగం చేసిన తమను ఉత్తి చేతులతో పంపించారు. ప్రభుత్వం వెంటనే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందించేందుకు చర్యలు తీసుకోవాలి.